Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలి : అధికారులకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ప్రజల హృదయాలను హత్తుకునే నిర్మాణం అమరవీరుల స్మారక చిహ్నమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. నిర్మాణ తుది దశ పనులను శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరాన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరవీరుల స్మారక చిహ్నం పనులను ఆయన గురువారం సమీక్షించారు. నిర్మాణ ప్రాంగణమంతా సుమారు నాలుగున్నర గంటలపాటు తిరిగి పనులను పరిశీలించారు. ప్రధాన ద్వారం, కాంపౌండ్ వాల్ రెయిలింగ్, పార్కింగ్, పూలమొక్కలు, పచ్చదనంతో చూపరులకు ఆహాదకరంగా ఉండేలా ల్యాండ్ స్కేప్ ఏరియా, తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ ప్రాంగణం, ఫౌంటేన్ ఏరియా, తెలంగాణ అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా ఫొటో ఆర్ట్ గ్యాలరీ, మ్యూజియం, ఆడియో, వీడియో విజువల్ స్క్రీన్, ఎస్కలేటర్ పనులను పకడ్బందీగా చేపట్టాలంటూ అధికారులను మంత్రి ఆదేశించారు. రెండో అంతస్తులో కన్వెన్షన్ హాల్, మూడో అంతస్తులో రెస్టారెంట్, కిచెన్ ఏరియా, నిరంతరం జ్వలించే జ్వాలలుండే జ్యోతి ఆకృతి నిర్మాణం పనులను ఆయన క్షుణ్నంగా పరిశీలించారు. సీఎం కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్ఈ లింగారెడ్డి, ఈఈ శ్రీనివాస్, నర్సింగరావు, డీఈ మాధవి, ఏఈ ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.