Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టిగ్లా వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ విద్యలో 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, తెలంగాణ ఇంటర్మీడియెట్ గవర్నమెంట్ లెక్చరర్ల సంఘం (టిగ్లా) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం జంగయ్య, ఎం రామకృష్ణగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) వి శాంతికుమారిని గురువారం హైదరాబాద్‌లో వారు కలిసి వినతిపత్రం సమర్పించారు. 317 జీవో అమలు కారణంగా 90 మంది ఉద్యోగులు, అధ్యాపకులకు అన్యాయం జరిగిందనీ, కుటుంబాలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. దీంతో వారు శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా బాధపడుతున్నారని పేర్కొన్నారు. 317 జీవో బాధిత అధ్యాపకులు, ఉద్యోగులకు న్యాయం చేయాలనీ, వారి అప్పీళ్లను పరిష్కరించాలని కోరారు. వారు కోరుకున్న సొంత ప్రాంతాలు, జోన్లు, జిల్లాలకు బదిలీ చేయాలని సూచించారు. పాఠశాల విద్యలోని ఉపాధ్యాయులకు చేపడుతున్నట్టుగానే ఇంటర్ విద్యలో సాధారణ బదిలీలకు అవకాశం కల్పించాలని తెలిపారు. సీఎస్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించండి
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) వి శాంతికుమారిని గురువారం హైదరాబాద్‌లో ఆయనతోపాటు కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేష్ నేతృత్వంలో కలిసి విజ్ఞప్తి చేశారు. వారిని క్రమబద్ధీకరించేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రభుత్వ కాలేజీల అభివృద్ధికి సహకరిస్తామని తెలి పారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం నాయకులు వస్కు ల శ్రీనివాస్, గొల్ల ఉదయభాస్కర్, కెపి శోభన్ బాబు, సునీల్ పాల్గొన్నారు.