Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలకు వైద్యాన్ని దూరం చేస్తున్న పాలకులు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-ఓయూ
కేంద్ర బడ్జెట్లో విద్య, వైద్య రంగానికి గత ఆర్థిక సంవత్సరంలో నిధులు తక్కువగా ఖర్చు చేశారని.. కనీసం ఈ బడ్జెట్లోనైనా కొఠారి కమిషన్ చెప్పినట్టు నిధుల కేటాయింపు పెంచాలని ఎమ్మెల్సీ, టీపీఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. 2023 -2024 కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి 10శాతం, వైద్య రంగానికి 6శాతం నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం హైదరాబాద్లోని ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ.. విద్యా రంగానికి నిధులు కేటాయించి పాఠశాల విద్యను బలోపేతం చేస్తూ, యూనివర్సిటీ విద్యను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగంలో స్కీంలు పెట్టి పేదలకు వైద్యాన్ని దూరం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు రంగాలకు నిధులు కేటాయింపులు గ్రాంట్స్ రూపంలో ఉండాలని సూచించారు. ఓయూ తెలుగు విభాగం హెడ్ ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా దేశ పాలకులు నేటికీ విద్యకు సరైన శాస్త్రీయమైన పద్ధతిలో బడ్జెట్ కేటాయించకపోవడం బాధాకరం అన్నారు. దీనిపై ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టినా పాలకులకు పట్టడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్స్ కొండ నాగేశ్వర్, ఆమంచి నాగేశ్వర్, వంశీధర్, టీపీఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.రాధేశ్యామ్, రాష్ట్ర సలహాదారు ఎంకె.దత్, జిల్లా కోశాధికారి రామకృష్ణ, సభ్యులు రాములు, మస్తాన్రావు, కోట నాయక్, ఎస్ఎఫ్ఐ ఓయూ అధ్యక్షకార్యదర్శులు ఆంజనేయులు, రవి నాయక్, ఉపాధ్యక్షులు రామాటేంకి శ్రీను, రమ్య, విద్యార్థులు పాల్గొన్నారు.