Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు తగ్గితే.. దేశంలో పెంచింది : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-మునగాల
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలోనూ వస్తే రావణ కాష్టం అవుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో గురువారం కాంతారెడ్డి సంస్మరణ సభలో తమ్మినేని పాల్గొన్నారు. అనంతరం దేవరం వెంకటరెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు. కులాలు, మతాల మధ్య ఘర్షణలను పెంచుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరిస్తుందని విమర్శించారు. విద్యుత్ వినియోగదారులపై నెల నెలా యూనిట్‌కు 30 పైసల చార్జీలు పెంచి భారాలు మోపాలని చూస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్ట్రిసిటీ చట్టం ప్రకారం విద్యుత్ చార్జీలు పెంచే అధికారం లేదన్నారు. ఇప్పటికే పెట్రోల్ డీజిల్‌పై ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచిందని గుర్తుచేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు తక్కువగా వున్నా.. దేశంలో మాత్రం పెరుగుతూనే ఉండటం దారుణమన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు నిధుల విషయంలో వివక్షకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ల వ్యవస్థ అధ్వానంగా మారిందన్నారు. గవర్నర్లు రోజు వారీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గవర్నర్ల వ్యవస్థను తొలగించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తుందన్నారు. రాష్ట్రంలో 12లక్షల ఎకరాల పోడుభూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు రైతులకు ఫిబ్రవరి నెలలో పట్టాలందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ధరణిలో 9లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఎత్తిపోతల పథకాలు నిర్లక్ష్యానికి గురౌతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎత్తిపోతల నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదేనని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. సాగర్ ఎడమ కాల్వపై ఉన్న ఎత్తిపోతల నిర్వహణ రైతులకు భారంగా మారిందన్నారు. ఆపరేటర్లకు వేతనాలు అందడం లేదన్నారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కాల్వల ద్వారా 60 శాతం మాత్రమే రైతాంగానికి సాగు నీరందుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మీ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కోటా గోపి, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.