Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26న జిల్లా కేంద్రాల్లో ట్రాక్టర్లు, వాహనాల ర్యాలీలు :
పోస్టర్ ఆవిష్కరణలో ఎస్కేఎం పిలుపు
- సింఘ్ బోర్డర్లో రైతు అమరుల స్థూపాన్ని నిర్మించాలి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతు ఉద్యమ సమయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ రైతులకిచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) డిమాండ్చేసింది. వాటిని సాధించుకునేందుకు వీలుగా ఈనెల 26న జిల్లా కేంద్రాల్లో ట్రాక్టర్లు, వాహనాల ర్యాలీలు నిర్వహించాలని ఎస్కేఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే నేపథ్యంలో రైతులకు నవంబర్ 21, 2021న రాతపూర్వక హామీ ఇచ్చిందని పేర్కొంది. వాటిని ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించింది. గురువారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఏఐకేఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఎస్కేఎం రాష్ట్ర నాయకులు టి. సాగర్, పశ్యపద్మ, రాయల చంద్రశేఖర్, మండల వెంకన్న, పెద్దారపు రమేష్, జక్కుల వెంకటయ్య, జక్కుల నరసింహ తదితరులు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించే చట్టం చేయాలనీ, అందుకోసం రైతు సంఘాల ప్రతినిధులతో కూడిన కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ పంటల ధరల ప్రకారం పెట్టిన పెట్టుబడిలో 80శాతం కూడా రైతులకు రాకపోవడంతో వారు రుణగ్రస్తులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల రైతు రుణాలను రద్దు చేసేందుకు పార్లమెంట్లో చట్టం చేయాలనీ, రుణ విమోచన చట్టం చేయాలని కోరారు.
రైతులతో చర్చించకుండానే విద్యుత్ సవరణ బిల్లు ఎలా ప్రవేశ పెడతారు?
విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని ఎస్కేఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. 'రైతు సంఘ నాయకులతో చర్చలు జరిపిన తర్వాతనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతామంటూ కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అందుకు పూర్తిగా భిన్నంగా బీజేపీ సర్కారు బిల్లును ప్రవేశ పెట్టిందని విమర్శించారు. రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చి బిల్లు ఆమోదానికి ప్రయత్నం చేస్తున్నదన్నారు. లఖింపూర్ఖేరి మూకుమ్మడి హత్యాఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. ఉద్యమ సందర్భంగా రైతులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలనీ, చనిపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ఓ అబద్ధంలాగా మార్చిందన్నారు. సమగ్ర చట్టం తయారు చేసి రైతులందరికీ కరువులు, వరదల సందర్భంగా పంటలు నష్టపోయిన వారందరికీ పరిహారాలు చెల్లించాలని కోరారు. ప్రస్తుత చట్టం బీమా కంపెనీలకు వేల కోట్లు లాభాలు కట్టబెడుతున్నదని విమర్శించారు. రైతులందరీ బీమా ప్రీమియాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలనీ, ఆ విధంగా చట్టాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. ఆరవై ఏండ్లు దాటిన సన్న, చిన్న, మధ్యతరగతి రైతులకు, వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు, చేతి వృత్తిదారులకు రూ.5వేల పెన్షన్ నిర్ణయించి అమలు చేయాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులపై పెడుతున్న అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
సింఫ్ు బోర్డర్లో చారిత్రాత్మక పోరాట కేంద్రం వద్ద రైతు అమరవీరుల స్థూపాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలనీ, రోజుకు రూ 600 కూలీ 200 రోజుల పని గ్యారంటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలనీ, కౌలు రైతులకు రుణార్హత కార్డులు ఇవ్వాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బి. ప్రసాద్, లెల్లెల బాలకష్ణ, వస్కుల మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.