Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవిర్భావ సభతో పార్టీ శ్రేణుల్లో జోష్
- సీఎం వరాలతో పాలాభిషేకాలు, కృతజ్ఞతలు
- ఇప్పటికైనా అంతర్గత పోరు సమసినట్టేనా..?
- హామీలు అమలు చేయాలంటున్న సీపీఐ(ఎం)
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మంలో బుధవారం నిర్వహించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సభ సక్సెస్ కావడం ఆ పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్నిస్తోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు పినరరు విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌మాన్‌తో పాటు జాతీయ స్థాయి నేతలు అఖిలేష్‌యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరవడంతో ఇప్పుడే ప్రస్థానం మొదలుపెట్టిన బీఆర్ఎస్ భవితవ్యంపై ఆ పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సభకు భారీగా జనం తరలిరావడానికి తోడు.. ఉద్యమాల గడ్డ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మతతత్వ బీజేపీని అడుగుపెట్టనీయబోమని నేతలంతా ముక్తకంఠంతో ప్రకటించడం ప్రజాస్వామ్య శక్తులకు నూతనోత్తేజాన్ని ఇచ్చినట్టయింది. వీటికి తోడు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి జిల్లాపై కురిపించిన రూ.కోట్లాది నిధుల అభివృద్ధి పనులపై హర్షాతిరేఖలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని.. మాట తప్పని నేతగా కేసీఆర్ నిలువాలనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. మున్నేరుకు నిధులు కేటాయిస్తూ పాలనపరమైన ఉత్తర్వులు ఇవ్వడంపై సీఎం కేసీఆర్‌కు మంత్రి అజరు, ఎంపీ రవిచంద్ర గురువారం హైదరాబాద్‌లో కలిసి కృతజ్ఞతలు తెలపడం గమనార్హం.
సీఎం వరాలు.. భిన్నస్వరాలు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గతంలో ఇచ్చిన హామీల్లో కొన్నింటిని సీఎం కేసీఆర్ నిలుపుకోవడంలో విఫలమయ్యారు. కొన్ని ఇవ్వని హామీలనూ అమలు చేశారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సభలన్నింటిల్లోనూ కేసీఆర్ దాదాపు ఒకే రకమైన హామీలిస్తున్నారు. ఈనెల 12వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం, పక్కనే ఉన్న మహబూబాబాద్‌తో పాటు బుధవారం ఖమ్మం సభలో ఇచ్చిన హామీలు కూడా దాదాపు ఒక్కటిగానే ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాలోని పంచాయతీలన్నింటికీ సీఎం ప్రత్యేక నిధి నుంచి రూ.10 లక్షల చొప్పున కేటాయించడం, అదేవిధంగా మున్సిపాల్టీలు, పెద్ద పంచాయతీలకు నిధుల విషయంలోనూ స్థాయిని బట్టి రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకూ మంజూరు చేస్తాననే ప్రకటన, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు, కొత్తగూడెంలో ముర్రేడు వాగు అభివృద్ధికి నిధులు, ఖమ్మంలో మున్నేరుపై వంతెన నిర్మాణానికి హామీ.. ఇలా అన్నీ ఒకలాంటి హామీలు ఇస్తూ వచ్చారు. వీటిలో కొన్ని హామీలు దీర్ఘకాలంగా పునరావృతం అవుతున్నా.. ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఉదాహరణకు జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశం రిపీటెడ్ హామీగానే ఉంటుంది తప్ప ఆచరణలోకి రావట్లేదు. 'కుర్చీ వేసుకుని కూర్చొని మరీ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తా...' అంటూ వరంగల్‌లో జర్నలిస్టులకు హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా అమలు చేయకపోవడంపై సోషల్‌మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఖమ్మంలో మున్నేరు నదీ పరిసరాల అభివృద్ధిపై హామీకి దాదాపు రెండేండ్లయింది. మున్నేరు కరకట్ట నిర్మాణానికి గతంలోనూ రూ.40 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. కానీ ఆచరణ లేదు. తిరిగి మున్నేరుపై తీగల వంతెన కోసం గురువారం రూ.180 కోట్లు కేటాయిస్తూ పరిపాలన ఉత్తర్వులు జారీ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వెలిబుచ్చుతూ కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశాయి. కానీ ఏమేరకు ఆచరణలోకి వస్తుందనే దానిపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.
పార్టీ ఏకతాటిపైకి వచ్చినట్టేనా..?
ఇక బీఆర్ఎస్లో అంతర్గత పోరు విషయంలోనూ ఇలాంటి సందిగ్ధతే నెలకొంది. అయితే ఆవిర్భావ సభ దానికి చాలా వరకు పరిష్కారం చూపిందనే వాదన వినిపిస్తోంది. కానీ అది ఎంతమేరకు అనే విషయంలో మాత్రం పార్టీ శ్రేణులకు స్పష్టత రావట్లేదు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాదాపు పార్టీకి దూరమైనట్టేనని సభకు ఆయన గైర్హాజరుకావడం, ఆయన వర్గీయులూ రాకపోవడం ఒకింత స్పష్టతనిచ్చినట్టయింది. ఆయన వర్గానికి చెందిన కొత్తగూడెం జడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య ఈ సభకు గైర్హాజరయ్యారు. పాలేరు నేతలు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు విషయంలో పొరపచ్చాలు మాత్రం సమసినట్టు లేదు. మాజీ మంత్రి తుమ్మల ప్రస్తుత మంత్రి పువ్వాడ అజరుకుమార్ మధ్య కూడా పూర్తిస్థాయిలో విభేదాలు తొలగకపోయి ఉండొచ్చని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మంత్రి హరీశ్‌రావు వారిద్దర్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఏమేరకు సఫలమయ్యాయి అనే విషయం భవిష్యత్‌కు వదిలేయాల్సిందే. జలగం వెంకట్రావుకు ఈ సభకు ఆహ్వానం అందిందనే వార్తలు వినిపించినా ఆయనా గైర్హాజరయ్యారు. ఏ ఫ్లెక్సీపైనా ఆయన ఫొటోలు లేకపోవడం చర్చకు దారితీసింది.
హామీలు స్వాగతిస్తున్నాం.. ఆచరణతోనే సార్థకత
నున్నా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి
ఇచ్చిన హామీలను స్వాగతిస్తున్నాం. అవి ఆచరణలో పెడితేనే సార్థకత. జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు, మున్నేరు బ్రిడ్జి, స్థానిక సంస్థలకు నిధులు ఇలాంటి అనేక సమస్యలపై సీపీఐ(ఎం) ఎప్పటి నుంచో పోరాడుతోంది. వాటిపై సీఎం హామీ ఇవ్వడం.. మున్నేరు సమస్యకు పాలనపరమైన ఉత్తర్వులు ఇవ్వడం హర్షనీయం. అలాగే జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశాన్ని నగరమే కాకుండా జిల్లా మొత్తానికి వర్తింపజేయాలి. హామీ ప్రకారం పోడు సమస్యకు పరిష్కారం చూపాలి. పోడు రైతులందరికీ పట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలకు ఇచ్చిన హామీని నిలుపుకోవడంతో పాటు జనరల్ యూనివర్శిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి.