Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైల్ నిలయం ఎదుట హెచ్‌యూజే, టీడబ్ల్యూజేఎఫ్,
టీబీజేఏ సంఘాల ధర్నా
- జీఎం ఏకె జైన్‌కు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
జర్నలిస్టుల రాయితీ రైల్వేపాసులను వెంటనే పునరుద్ధరించాలని హైదరాబాద్ యూనియన్ అఫ్ జర్నలిస్ట్స్(హెచ్‌యూజే) , తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్), తెలంగాణ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీబీజేఏ) డిమాండ్ చేశాయి. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు గురువారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. కరోనా కంటే ముందు వరకు కొనసాగిన రాయితీని ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడాన్ని ఖండించారు. కరోనా కాలం ముగిసి ఏడాది అవుతున్నా రాయితీ సౌకర్యాన్ని పునరుద్ధరించకపోవడాన్ని తప్పుబట్టారు. భారీ సంఖ్యలో పాల్గొన్న జర్నలిస్టుల నినాదాలతో రైల్ నిలయం దద్ధరిల్లింది. దాదాపు రెండు గంటల పాటు జర్నలిస్టుల ధర్నా కొనసాగింది. అనంతరం జర్నలిస్టుల రైల్వేపాసులు కొనసాగించాలని కోరుతూ సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్‌కు జర్నలిస్టు సంఘాలతో కూడిన ప్రతినిధి బందం వినతి పత్రం సమర్పించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య మాట్లాడుతూ రాయితీని కేంద్రం ఇపుడు కొత్తగా ఇచ్చేది కాదనీ, ఏండ్ల తరబడి కొనసాగుతున్నదేనని చెప్పారు. మీడియాను, జర్నలిస్టులను గౌరవించాలని కోరారు. అసలే వేతనాలు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు, 50 శాతం రాయితీ లేక అనేక కష్టాలు పడుతున్నారని చెప్పారు. జర్నలిస్టుల రైల్వేపాస్‌లను కేంద్రం పునరుద్దరించక పోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిగ రఘు, కార్యదర్శి ఇ.చంద్రశేఖర్ మాట్లాడుతూ జర్నలిస్టుల రైల్వే పాస్ రాయితీల విషయంలో కేంద్రం తీరు సరైంది కాదన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. హెచ్‌యూజే అధ్యక్ష, కార్యదర్శులు బి. అరుణ్‌కుమార్, బి.జగదీశ్ మాట్లాడుతూ చిన్న మధ్య తరగతి జర్నలిస్టుల విషయంలో కేంద్ర వైఖరి మార్చుకోవాలనీ, రాష్ట్ర ఎంపీలు ఈ విషయమై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఎంపీలకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్కె సలీమ, గండ్ర నవీన్ , బి. రాజశేఖర్. రాష్ట్రకార్యవర్గ సభ్యులు పి.నాగవాణి , మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మెరుగు చంద్రమోహన్, హెచ్‌యూజే నాయకులు సుభాష్ , వీరేష్ తదితరులు పాల్గొన్నారు.