Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించిన అధికారులు
- 25 ఫైరింజన్లు.. 50 నీటి ట్యాంకర్ల వినియోగం
- గురువారం అర్ధరాత్రికి పరిస్థితి అదుపులోకి..
- దట్టమైన పొగతో ఇబ్బందికిి గురైన స్థానికులు
- తీవ్ర అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలింపు
- నలుగురిని రక్షించిన అధికారులు
నవతెలంగాణ-బేగంపేట్
సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మినిస్టర్ రోడ్డులోని 'దక్కన్ నైట్‌వేర్ స్పొర్ట్స్' దుకాణంలో గురువారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
గుజరాత్‌కు చెందిన మహ్మద్ జావిద్ రహీం సికింద్రాబాద్‌లో 'దక్కన్ నైట్‌వేర్ స్పొర్ట్స్' దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భవనం రెండు సెల్లార్లతో కూడిన ఆరు అంతస్తులుండగా, మొదటి అంతస్తులో కార్ డెక్కార్ వర్క్ చేస్తున్నారు. రెండో అంతస్తులో టీషర్ట్స్కు పెయింట్ వర్క్ చేస్తుండగా, మిగిలిన అంతస్తులో రా మెటీరియల్ ఉంచారు. రెండో అంతస్తులో అధిక మొత్తంలో రసాయనాలను ఉంచారు. అయితే, గురువారం ఉదయం 10:30గంటల సమయంలో ఒక్కసారిగా దుకాణంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న తెలంగాణ రీజినల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య వెంటనే సిబ్బందిని రంగంలోకి దించారు. మంటలను ఆర్పేందుకు దాదాపు 25 ఫైరింజన్లతో అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రాత్రి వరకు మంటలు అదుపులోకి వచ్చాయి. ఓ వైపు మంటలను అదుపు చేసేందుకు అధికారులు శ్రమిస్తుండగా.. మరో భవనానికి వ్యాపించాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. దాంతో చుట్టుపక్కల వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో నలుగురిని పోలీసులు, అగ్నిమాక సిబ్బంది రక్షించారు. దట్టమైన పొగతో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురవ్వగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. రాంగోపాల్‌పేట పోలీసులు దుకాణ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భారీ అగ్ని ప్రమాదం వల్ల భవనం పూర్తిగా దెబ్బతింది. కూలిపోయే ప్రమాదం ఏర్పడింది.
సిలిండర్ల తరలింపు
భారీ ఎత్తున అగ్నిప్రమాదం సంభవించడంతోపాటు భవనం లోపల నుంచి పేలుడు శబ్దాలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు ముందుగా మూడు ఫైరింజన్లతో మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. అయితే మంటలు అదుపు కాకపోవటంతో మరో మూడింటిని ఘటనాస్థలికి తెప్పించారు. ఆ తర్వాత మరికొన్ని ఫైరింజన్లను తెప్పించారు. నారాయణగూడ, సికింద్రాబాద్ నుంచి 50 వాటర్ ట్యాంకర్లతోపాటు దాదాపు 25 ఫైరింజన్లతో సహాయక చర్యలు చేపట్టినప్పటికీ అర్ధరాత్రి వరకుగానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దట్టమైన పొగతో ఊపిరాడక చిన్నారులు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అప్రమత్తమైన అధికారులు ఆ సమీపంలోని కాలనీని ఖాళీ చేయించారు. ముందస్తు చర్యలో భాగంగా చుట్టుపక్కల ఇండ్ల నుంచి గ్యాస్ సిలిండర్లను అక్కడి నుంచి తరలించారు. మినిస్టర్ రోడ్లో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితోపాటు డీఆర్ఎఫ్, 108 సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు: మంత్రులు
హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. అగ్నిప్రమాద ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. భవనంలో చిక్కుకున్న నలుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారని వెల్లడించారు. దుకాణం లోపల మరో ఇద్దరు ముగ్గురు చిక్కుకొని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇండ్ల మధ్య గోదాములు, పరిశ్రమలు ఉండటం దురదృష్టకరమన్నారు. వీటితో ప్రజలకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారితోపాటు అక్రమంగా గోదాములు, దుకాణాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విచారణ అనంతరం.. అవసరమైతే భవనాన్ని కూల్చేస్తామని చెప్పారు.