Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రుచి, సువాసన, పోషకాలతో విశిష్ట లక్షణాలు
- రైతులు, శాస్త్రవేత్తలకు మంత్రి నిరంజన్‌రెడ్డి అభినందనలు
- 31న ప్రత్యేక కార్యక్రమం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వికారాబాద్ జిల్లాలోని తాండూరు కందికి భౌగోళిక గుర్తింపు లభించింది. రుచి, సువాసన,పోషకాల వంటి విశిష్ట లక్షణాలు ఉన్నాయి. అక్కడి నేలల స్వభావం, భూమిలో పోషకాలు, అనుకూల వాతావరణ పరిస్థితులు, రైతులు ఆచరించే సాంప్రదాయ, ఆధునిక యాజమాన్య పద్దతుల మూలంగా దీనికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాల్లోని లక్ష 48 వేల ఎకరాలలో కంది సాగవుతుంది. ఇప్పటి వరకూ దేశమంతటా భౌగోళిక గుర్తింపు కోసం వివిధ రంగాల నుంచి వెయ్యి దరఖాస్తులు 432 ఉత్పత్తులకు మాత్రమే ఆ గుర్తింపు వచ్చింది. ఆజాది కా అమృత్ ఉత్సవాల్లో 75 ఉత్పత్తులు జీఐజర్నల్లో ప్రచురింతమయ్యాయి. ఈ ఏడాది వచ్చిన దరఖాస్తుల్లో కేవలం తొమ్మిది ఉత్పత్తులకు మాత్రమే గుర్తింపు దక్కగా అందులో తాండూరు కంది ఒకటి కావడం గమనార్హం. ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతానికి 16 ఉత్పత్తులకు గుర్తింపు దక్కగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరు ఉత్పత్తులు భౌగోళిక గుర్తింపు పొందాయి. పుట్టపాక తేలియ రుమాలు (2015), బంగినపల్లి మామిడి (2017), ఆదిలాబాద్ ఢోక్రా, వరంగల్ డురీస్(2018), నిర్మల్ పెయింటింగ్ (2019), తాండూరు కంది (2022) గుర్తింపు పొందిన ఉత్పత్తుల్లో ఉన్నాయి. అందులో మామిడి, కంది ఉద్యాన, వ్యవసాయ రంగ ఉత్పత్తులు కావడం విశేషం. పండిన పప్పు ఎక్కువ కాలం నిల్వ ఉండడం, తొందరగా ఉడకడం, మంచి రుచి, వాసన తాండూరు కంది ప్రత్యేకత ఆ ప్రాంతంలో ఉన్న సున్నపురాయి నిక్షేపాల వల్ల వచ్చే పోషక నాణ్యతలే దీనికి కారణమని పేర్కొంది. దేశంలోని ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా పట్టణాల్లో తాండూరు కంది బ్రాండ్‌కు డిమాండ్ ఉన్నది. భౌగోళిక గుర్తింపు కోసం ధరఖాస్తు చేసుకున్న యాలాల రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం, తాండూరు కంది పరిశోధనా స్థానంతోపాటు ఆ ప్రాంత రైతులు, వ్యవసాయ విద్యాలయం సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, కంది పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా ఒక ప్రకటనలో అభినందించారు. ఈ నెల 31న కంది పరిశోధనా కేంద్రంలో తాండూరు రైతులు, శాస్త్రవేత్తల అభినందన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.