Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఈఆర్సీ ఆదేశాలు ఉపసంహరించుకోవాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రతి నెలా ఇంధన సర్దుబాటు చార్జీలను పెంచుకోవచ్చనీ, ఈ పెంపుదలకు రెగ్యులరేటరీ కమిషన్ అనుమతులు అవసరం లేదంటూ తెలుపుతూ డిస్ట్రిబ్యూటరీ కమిటీ (డిస్కాంలు)లకు విద్యుత్ నియంత్రణ మండలి స్వేచ్ఛ కల్పించడం పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. విద్యుత్ వినియోగదారులపై భారాలు మోపే ఈ ఆదేశాలు తగదనీ, ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. తక్షణమే రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2018 నుంచి 2022 వరకు రెగ్యులేటరీ కమిషన్ టారీఫ్ నిర్ణయించలేదని తెలిపారు. డిస్కాంలు ఎలాంటి టారీఫ్ ప్రతిపాదనలు ఇవ్వలేదని వివరించారు. ఈ నాలుగేండ్ల బాకీలు రూ.33 వేల కోట్ల వసూళ్లకు 2022-23లో టారీఫ్ ప్రతిపాదనలో ఎలాంటి సూచనల్లేవని పేర్కొన్నారు. రెగ్యులేటరీ కమిషన్ అనుమతి లేకుండానే డిస్కాంలు గతేడాది ''డెవలప్మెంట్ ఛార్జీలు'' పేరుతో విద్యుత్ వినియోగదారులపై భారాలు వేసి రూ.వేల కోట్లను అక్రమంగా వసూలు చేశాయని విమర్శించారు. డిస్కాంలు అంతర్గత సామర్థ్యం పెంచుకోకుండా వినియోగదారులపై భారాలు వేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేటికీ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయని వివరించారు. చట్ట ప్రకారం బొగ్గు, గ్యాస్, నీరు తదితర ముడి సరుకుల ధరలు పెరిగినప్పుడు వాటికనుగుణంగా ఛార్జీలను పెంచాలంటూ డిస్కాంలు దరఖాస్తులు పెట్టుకుంటున్నాయని తెలిపారు. రెగ్యులేటరీ కమిషన్ బహిరంగ విచారణ జరిపి ముడిసరుకుల ధరలకనుగుణంగా ఛార్జీలను నిర్ణయించాలని పేర్కొన్నారు. కానీ ముడిసరుకు ధరలు పెరుగుతున్నాయంటూ డిస్కాంలు తప్పుడు లెక్కలు చూపించి వినియోగదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నాయనీ, ఇది సరైంది కాదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు డిస్కాంలు ''ఫ్యూయల్ సర్ ఛార్జీలు'' ఎప్పటికప్పుడు వసూలు చేసుకోవాలంటూ గత నాలుగు రోజుల క్రితం విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటించడం అత్యంత దుర్మార్గమని తెలిపారు. వచ్చేనెలలో విద్యుత్ ఛార్జీల పెంపుపై బహిరంగ విచారణ ఉన్నందున, ఈనెల 30 లోపు విద్యుత్ ఛార్జీల పెంపుపై డిస్కాంల ప్రతిపాదనలపై అభ్యంతరాలను తెలియజేయాలంటూ రెగ్యులేటరీ కమిషన్ ప్రకటించిందని వివరించారు. అనేకమంది అభ్యంతరాలు కూడా తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. కాబట్టి వచ్చేనెలలో జరిగే బహిరంగ విచారణలో టారీఫ్‌లు నిర్ణయించే వరకు వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయొద్దని డిమాండ్ చేశారు. రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన అక్రమ ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలనీ, వినియోగదారులపై భారాలు పడకుండా చూడాలని కోరారు.