Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపటిలోగా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం
- పరిహారం విషయం తేల్చాకే ప్రాజెక్టు పనులు: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు
- నిర్వాసితుల పాదయాత్ర, కలెక్టరేట్ ఎదుట మహాధర్నా
నవతెలంగాణ- భువనగిరి
బస్వాపురం ప్రాజెక్టులో ముంపునకు గురవుతూ సర్వం కోల్పోతున్న బీఎన్ తిమ్మాపురం గ్రామ నిర్వాసితుల సమస్యలను రేపటి లోగా పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వారి సమస్యలను పరిష్కరించిన తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న తిమ్మాపురం భూనిర్వాసితుల కమిటీ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద 48 గంటల మహాధర్నా చేశారు. అక్కడే వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పిన్నం లతారాజు, ఎంపీటీసీ ఉడత శారద ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ అధ్యక్షతన నిర్వహించిన సభలో వెంకట్రాములు మాట్లాడుతూ.. తిమ్మాపూర్ గ్రామస్తులు బస్వాపురం ప్రాజెక్టులో సర్వం కోల్పోతున్నారని వారిని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం 52 రోజులుగా ప్రాజెక్టు క్యాంపు కార్యాలయం దగ్గర కరకట్టపై నిరసన దీక్ష చేపట్టినా ప్రభుత్వంగానీ జిల్లా యంత్రాంగంగానీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. నిర్వాసితుల పట్ల నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు కోల్పోతున్న వారందరికీ 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబంలోని ప్రతి సభ్యునికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, పీసీసీ కార్యదర్శి తంగళ్ళపల్లి రవికుమార్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏషాల అశోక్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ధర్నాకు మద్దతు తెలిపి మాట్లాడారు. జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన నిర్వాసిత గ్రామవా సులందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలన్నారు. 2009లో ప్రకటించిన ఈ ప్రాజెక్టుకు ఫిబ్రవరి 2019లో 1724 ఎకరాల భూములు తీసుకుని నేటివరకు పూర్తి స్థాయిలో నష్ట పరిహారం అందించలేదన్నారు. నిధులు మంజూరైనట్టు చెబుతున్నా ఇవ్వడం లేదన్నారు. గ్రామంలో చదువుకున్న యువతీయువకులకు డ్యాంలో, యాదాద్రి దేవాలయంలో ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. పట్టా భూములకు, ప్రభుత్వ భూములకు ఒకేసారి నష్టపరిహారం కింద డబ్బులు చెల్లించాలన్నారు. వ్యవసాయ కూలీలందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలన్నారు. వృత్తిదారులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు అన్ని విధాలా ఆదుకోవాలని, లేకపోతే రాజకీయ పార్టీలకతీతంగా ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. జెడ్పీటీసీ బీర్.మల్లయ్య, ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మెన్, డైరెక్టర్ ఎడ్ల సత్తిరెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ ఎడ్ల దర్శన్రెడ్డి, మాజీ గ్రామ సర్పంచ్ రావుల అనురాధ నందు, మాజీ ఎంపిటిసి జిన్న మల్లేష్, సుదగాని ఫౌండేషన్ చైర్మెన్ సుధాగాని హరిశంకర్గౌడ్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కల్లూరి మల్లేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, పెద్దఎత్తున రైతులు తదితరులు పాల్గొన్నారు.