Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వన్యప్రాణుల సంరక్షణ, ఎకో టూరిజంతో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్ధి
- స్థానిక ఆదివాసి, చెంచులు, మహిళలకు ఉపాధి కల్పన : మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ - అచ్చంపేట రూరల్
రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అటవీ, దేవాదాయ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని మన్ననూర్ టైగర్ రిజర్వ్‌లో ఎకో టూరిజంలో భాగంగా ఎంపీ రాములు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి 8 నూతన సఫారీ వాహనాలను, వనమాలికలోని 6 టూరిజం కాటేజీలను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యాటకులకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఎంతో ఆహ్లాదకరమైనదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్, అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్‌లను ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ల పరిధిలో నివసించే గిరిజన, చెంచు, ఆదివాసీలకు అటవీ సంరక్షణ సిబ్బందిగా, వాచ్మెన్లుగా ఉపాధి కల్పిస్తామని తెలిపారు. కలప స్మగ్లింగ్‌ను పూర్తిగా అరికట్టడం వల్ల వన్యప్రాణుల సంఖ్య పెరగడంతో పాటు చెట్ల అభివృద్ధి బాగా పెరిగిందన్నారు. టైగర్ రిజర్వుల సమీపంలో మరిన్ని ఎకో టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో రూ.1.20 కోట్లతో ప్రత్యేకంగా తయారు చేసిన 8 సఫారీ వాహనాలు, రూ.90 లక్షలతో నిర్మించిన 6 కాటేజీలను ప్రారంభించినట్టు చెప్పారు. నేటి నుంచి అంతర్జాలం ద్వారా బుక్ చేసుకునేందుకు అవి అందుబాటులో ఉంటాయన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ 71 కి.మీ. కృష్ణా నది పరివాహక ప్రాంతంతో శ్రీశైలం, ఉమామహేశ్వరం, సలేశ్వరం, మద్దిమడుగు అంజనేయస్వామి వంటి ప్రముఖ దేవాలయాలు ఉండటం వల్ల ఎకో టూరిజానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లు మంచి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందాయన్నారు. జంతువుల సంరక్షణ కోసం 160 ఊట చెరువులు, 99 చెక్‌డ్యాంలు, 1149 సాసర్ పిట్స్, 29 సోలార్ బోర్‌వెల్స్ ఉన్నాయన్నారు. అడవులను ప్లాస్టిక్ ఫ్రీ జోన్లుగా ప్రకటించామని, వన్యప్రాణులకు హాని చేసే ప్లాస్టిక్‌ను అడవులకు దూరంగా ఉంచాలని చెప్పారు.
యురేనియం విషయం ముగిసిన కథ
యురేనియం తవ్వకాల కథనాలపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. యురేనియం తవ్వకాల విషయం ముగిసిన కథ అన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేశారని గుర్తు చేశారు. ఇదే అంశంపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ లబ్ది కోసం ఈ అంశాన్ని తిరగదోడుతూ కుట్రలకు తెర లేపుతున్నారని ఆరోపించారు. వీరంతా ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఎంపీ రాములు మాట్లాడుతూ.. మంత్రి చెప్పిన విధంగానే పార్లమెంట్లో కూడా యురేనియం తవ్వకాల నిషేధంపై తీర్మానం చేశారని, తవ్వకాలపై ప్రజలు నమ్మొద్దని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మెన్ శాంతికుమారి, ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, పీసీసీఎఫ్,హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జ్కెస్వాల్, ఎఫ్డీసీ వీసీ, ఎండీ చంద్ర శేఖర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ పి.ఉదరు కుమార్, అమ్రాబాద్ ఫీల్డ్ డైరెక్టర్ క్షితిజ, నాగర్‌కర్నూల్ డీఎఫ్ఓ రోహిత్ గోపిడి తదితరులు పాల్గొన్నారు.