Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనాధల హక్కుల పోరాట వేదిక ఆవిర్భావం: మంద కృష్ణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అనాధలెంతమంది ఉన్నారో తేల్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎంఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎంవి ఫౌండేషన్ అధ్యక్షులు ఆర్ వెంకట్ రెడ్డితో కలిసి శుక్రవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'అనాధల హక్కుల పోరాట వేదిక'ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ అనాధల సమస్యలను పరిష్కరించటానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం సిఫార్సులను వెంటనే అమలు చేయాలన్నారు. లేదంటే అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి, రాజకీయ పోరాటానికి సిద్ధం కానున్నట్టు తెలిపారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అనాధలకు ఐదు శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగానే అనాధ వివక్షత నిరోధక చట్టాన్ని తీసుకు రావాలని కోరారు. అనాధల సమస్యల పరిష్కారానికి 2022 జనవరి 8న మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సు చేసిన స్మార్ట్ కార్డు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించాలన్నారు. 2015లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా రాష్ట్రవ్యాప్తంగా అనాధలకు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 23న రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం, 30న ధర్నా చౌక్‌లో మహాదీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు.