Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విడిగా అన్నింటినీ విచారిస్తామన్న హైకోర్టు
నవతెలంగాణ -హైదరాబాద్
డీజీపీ అంజనీకుమార్ సహా మరో 11 మంది అఖిల భారత సర్వీస్ అధికారులను తెలుగు రాష్ట్రాలకు కేటాయించటానికి సంబంధించిన వివాదాల వ్యాజ్యాలను సంబంధిత డివిజన్ బెంచ్ విచారిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. తొమ్మిది మంది ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీ, తెలంగాణలకు కేటాయించటంపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన తీర్పును కేంద్రం సవాల్ చేసిన కేసులో పిటిషన్లను ఈ నెల 27న కోర్టు విచారించనుంది. సంబంధిత డివిజన్ బెంచికి ఈ కేసులను నివేదించేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ చీఫ్ జస్టిస్ ఉజ్జల్‌భూయాన్, న్యాయమూర్తి జస్టిస్ తుకారాంజిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఐఎఎస్ అధికారి, తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్‌కుమార్ కేసులో ఇచ్చిన తీర్పు 12 మంది అధికారుల కేసులకు వర్తించబోదని తెలిపింది. ఆయా కేసుల్లోని అంశాలను వేర్వేరుగా విచారించాల్సి ఉంటుందని పేర్కొంది. తొలుత కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఈ కేసును వాదించేందుకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్‌రెడ్డి వస్తారనీ, ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో లేరని చెప్పారు. కేంద్ర సర్వీస్ అధికారుల తరఫు న్యాయవాదులు కల్పించుకుని సోమేష్‌కుమార్ కేసుకు, తమ కేసుకు సంబంధం లేదని తమ కేసుల్లోని వినతులు వేర్వేరని చెప్పారు. విడివిడిగా కేసుల్ని విచారిస్తామన్న హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. సోమేష్‌కుమార్ కేసులో హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. మిగిలిన తొమ్మిది మంది ఐఏఎస్‌లు సి. హరి కిరణ్, జి. అనంత రాములు, మల్లెల్ల ప్రశాంతి, కరుణ వాకాటి, ఎ. వాణీ ప్రసాద్, రొనాల్డ్ రాస్, సృజన గుమ్మళ్ల, శివశంకర్ లోహేటి, షంషేర్ సింగ్ రావత్, ఆమ్రపాలి కోట, ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్, క్యాట్ నుంచి 2016లో ఉత్తర్వులు పొంది ఏపీ,తెలంగాణల్లో కొనసాగుతున్నారు. దీనిపై కేంద్రం వేసిన అప్పీళ్ల పిటిషన్లకు సంబంధించి తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ బెంచ్ ఆదేశాలిచ్చింది..