Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతినియోజకవర్గానికి మూడువేల యూనిట్లు
- విజయడెయిరీ రైతులకు ముద్రరుణాలు
- ఔట్లెట్ల సంఖ్య పెంచుతాం : మంత్రి తలసాని
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పాడిరంగంపై ఆధారపడిన రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలిప్పించడం ద్వారా పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. బ్యాంకు రుణాల ద్వారా ఒక్కో నియోజకవర్గానికి 2500 నుంచి మూడు వేల యూనిట్ల వరకు పాడి పశువులను ఇప్పించడం ద్వారా యువతకు, పాడి రంగంపై ఆధారపడి ఉన్న రైతులకు ఆర్ధిక స్వావలంభన వచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించాలని కోరారు. విజయ డెయిరీ ఉత్పత్తుల ఔట్లెట్ల సంఖ్య పెంచుతామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్‌లోని మంత్రి కార్యాలయంలో విజయ డెయిరీ చైర్మెన్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సోమా భరత్ కుమార్ అధ్యక్షతన బోర్డు సమావేశమైంది. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి, వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వీరోజిరావు, ఎన్డీడీబీ అధికారి సునీల్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ పాడి సంపద అభివృద్ధి ద్వారా విజయ డెయిరీకి పాలు పోసే రైతుల సంఖ్య పెంచాలనీ, రైతులు, డెయిరీ భాగస్వామ్య పద్దతిలో నూతనంగా నిర్మిస్తున్న మెగా డెయిరీకి అవసరమైన పాలను సునాయసంగా పొందేలా విధివిధానాల రూపొందించాలని ఆదేశించారు. విజయ డెయిరీకి సక్రమంగా పాలు పోసే రైతులకు ముద్ర రుణాలు మంజూరు చేయించడం ద్వారా రైతులు అదనపు పాడి పశువులను కొనుగోలు చేసి పాల ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంటుందని చెప్పారు. సొసైటీ సభ్యత్వ నమోదు కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని చెప్పారు. విజయ డెయిరీ పాల ఉత్పత్తుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్యాకేజీపై ఒరిస్సా, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు, బాదంపాలు తదితర ఉత్పత్తులు గ్లాస్ బాటిల్స్ స్థానంలో పెట్ బాటిల్స్ ద్వారా సరఫరా చేసేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. విజయ డెయిరీ ఉత్పత్తులను వివిధ ప్రాంతాలలో తిరిగి విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమ్మక్క సారక్క, పెద్దగట్టు, కొమురెల్లి, ఏడుపాయల తదితర జాతర్లలో సంతలు, సమావేశాలు జరిగే ప్రాంతాలలో విజయ ఉత్పత్తులు అమ్మేందుకు ప్లాన్ చేయాలని సూచించారు.
'పాత కట్టడాల'పై 25న ఉన్నతస్థాయి సమావేశం..
నిట్ ఆధ్వర్యంలో కమిటీ : మంత్రి తలసాని వెల్లడి
సికింద్రాబాద్ రాంగోపాల్‌పేటలో అగ్ని ప్రమాదం సంభవించిన భవనంలో రసాయనాలు ఉండటం వల్లే మంటలు అదుపులోకి రాలేదని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. మంటలను అదుపు చేయటంతోపాటు బాధితులను రక్షించేందుకోసం అగ్నిమాపక దళంతోపాటు ప్రభుత్వ విభాగాలన్నీ వెంటనే స్పందించాయని ఆయన చెప్పారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కాలం చెల్లిన, పాతబడిన భవనాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. వాటికి సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు వీలుగా ఈనెల 25న ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. నిట్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని వివరించారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి తలసాని మాట్లాడారు. ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. తమ ప్రభుత్వం డబ్బుల కోసం అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరిస్తున్నదంటూ ఆయన మాట్లాడటం అత్యంత బాధ్యతారాహిత్యమని విమర్శించారు. భవనాల క్రమబద్ధీకరణపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలియదా..? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక్క భవనాన్ని కూడా క్రమబద్ధీకరించలేదని తలసాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.