Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ డైరీ ఆవిష్కరణలో ఎమ్మెల్సీ గోరటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మార్క్స్, అంబేద్కర్ స్ఫూర్తితో సామాజిక ఉద్యమాలను బలోపేతం చేయాలని శాసనమండలి సభ్యులు ప్రముఖ ప్రజా వాగ్గేయకారులు గోరటి వెంకన్న పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కెేవీపీఎస్ ముద్రించిన 2023 డైరీని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ప్రపంచ చరిత్ర గతిని మార్చిన మార్క్స్ జీవిత లక్ష్యమైన దోపిడీ లేని సమాజాన్నీ, ప్రపంచంలో ఎక్కడా లేని దుర్మార్గమైన కుల వ్యవస్థను రూపుమాపడానికి తమ సర్వస్వం త్యాగం చేసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మార్గదర్శకంలో సామాజిక ఉద్యమాలు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మనోభావాల పేరిట జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు ప్రజల ప్రశాంతతను దెబ్బతీస్తాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు రెచ్చగొట్టడం, విద్వేషాలు రగిలించడం లాంటి పనులు ఎవరు చేసినా తప్పేనన్నారు. సామాజిక, ప్రజాస్వామిక హక్కులను రాజ్యాంగం కల్పించిందనీ, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కెేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో దళితులపై దాడులు జరిగితే ఉద్యమిస్తున్న యువతరం నేడు మనువాదం ద్వారా మన రాజ్యాంగానికి పొంచి ఉన్న ప్రమాదం పై కూడా సంఘటిత ప్రతిఘటన ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. గత 15 ఏండ్లుగా కేవీపీఎస్ డైరీలో మహనీయుల జీవిత చరిత్రలతో పాటు అనేక చట్టాలు, జీవోలను ముద్రించామని వివరించారు.టీపీఎస్కే రాష్ట్ర కార్యదర్శి జి రాములు మాట్లాడుతూ కేవీపీఎస్ రాష్ట్రంలో నిర్వహించిన పోరాటాలు అనేక మంది ప్రముఖుల ప్రశంసలు పొందాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో నియోకర్సర్ డైరెక్టర్ బొజ్జ బిక్షమయ్య, టీపీటీ టిఎల్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఐత విజరు కుమార్, రిటైర్డ్ పంచాయతీరాజ్ అధికారి ఇ. నర్సింగరావు కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున సహాయ కార్యదర్శి బొట్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.