Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఆధీనంలో ఈ రంగాలు ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
2023-24 కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి 10 శాతం, వైద్య రంగానికి 6 శాతం నిధులు కేటాయించాలని తెలంగాణ పౌర స్పందన వేదిక వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో శుక్రవారం తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్లో కొఠారి కమిషన్ (మొట్టమొదటి జాతీయ విద్యా విధాన ప్రాతిపదిక) నివేదిక ప్రకారం.. విద్యారంగానికి 10 శాతం, వైద్య రంగానికి 6 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అధ్యాపకులు, విద్యార్థులతో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్యం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ప్రజానీకానికి నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందాలన్నారు. విద్య, వైద్య రంగాలు ప్రభుత్వ ఆధీనంలో వున్నప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. ఇది అనేక అభివృద్ధి చెందిన దేశాల అనుభవం చెబుతోందని చెప్పారు. కానీ, దేశంలో ఈ రెండు రంగాలు పూర్తిగా ప్రయివేటు, కార్పొరేట్ల చేతిలోకి పోయి సామాన్య ప్రజానీకానికి అందుబాటులో లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేండ్లలో ఈ విషయం మరింతగా స్పష్టమైందన్నారు. ఈ క్రమంలో కడుపు కట్టుకునైనా పిల్లలకి మంచి విద్య చెప్పించాలనే తపన దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి కుటుంబాల్లో పెరుగుతోందన్నారు. దీనిని అవకాశంగా తీసుకొని ప్రయివేటు రంగం దోపిడీ మరింత పెరుగుతోందన్నారు.
ఏదైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే ఆస్తులు అమ్ముకున్నా నయం కాక.. అప్పులపాలయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విస్తృత ప్రజానీకానికి నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ప్రభుత్వం అందిస్తే చాలు, ఇతర పథకాల అవసరం చాలా తగ్గిపోతుందనే చర్చ బలపడుతోందని చెప్పారు. అనేక ప్రజాసంఘాలు, సంస్థలు, ఆఖరికి రాజకీయ పార్టీలు కూడా ఉచిత విద్య, వైద్యం కావాలని డిమాండ్ చేస్తున్నాయని గుర్తు చేశారు. 14 ఏండ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా, ఉచితంగా నాణ్యమైన విద్య అందించాలన్నారు. కానీ ఈ రంగాలకు బడ్జెట్ కేటాయింపులు నానాటికీ కుదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ విద్యకు నాలుగు శాతం, వైద్యానికి మూడు శాతం కూడా నిధులు కేటాయించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విద్య, వైద్య రంగాల బలోపేతానికి ప్రజానీకం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆకుల రవి, అధ్యాపకులు అంజిరెడ్డి, రమణారెడ్డి, మధు పాపయ్య, తెలంగాణ పౌర స్పందన వేదిక జిల్లా అధ్యక్షులు పాల్వాయి అంజిరెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి వనం వాణిశ్రీ, యూటీఎఫ్ జిల్లా కోశాధికారి నారా శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.