Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్చల వీడియోలు విడుదల
- చాలా కాలం తర్వాత గాంధీభవన్‌కు...
- మాణిక్‌రావు ఫోన్ చేయడంతో వచ్చా : వెంకట్‌రెడ్డి
- 'హాత్ సే హాత్' యాత్రపై ఠాక్రే చర్చ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నిక నాటి నుంచి కాంగ్రెస్ దూరంగా ఉంటూ వస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి...శుక్రవారం గాంధీభవన్‌కు రావడం చర్చనీయాంశమవుతున్నది. అసలే ఉప్పు, నిప్పుగా కొనసాగుతున్న రేవంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. కాంగ్రెస్ నిర్ణయాలను వ్యతిరేకించడంతోపాటు బహిరంగ ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలోకి వెళతారనే ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో రాష్ట్రానికి కొత్తగా వచ్చిన ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే ఆహ్వానంమేరకు పీసీసీ చీఫ్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈసారి గాంధీభవన్‌కు రావాలంటూ ఠాక్రే ఫోన్ చేయడంతో శుక్రవారం ఆయన అక్కడి వచ్చారు. ఠాక్రే సమక్షంలో రేవంత్, వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఇరువురూ చర్చించుకుంటున్న వీడియోలను పార్టీ విడుదల చేసింది. హాత్ సే హాత్ అభియాన్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో వారు కలిసిపోయారనే సంకేతాలు ఇచ్చేందుకు ఠాక్రే ఓ ప్రయత్నం చేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిది స్థిరమైన మనస్తత్వం కాదనీ, ఆయన ఎప్పుడేం మాట్లాడుతారో ఎవరూ చెప్పలేదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత రేవంత్, కోమటిరెడ్డి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు ఏదో అంశంపై సీరియస్‌గా చర్చించుకోవడం పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరు నేతలూ ఏం మాట్లాడుకు న్నారా? అని మీడియాతో పాటు, పార్టీ నేతలు కూడా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అంతకు ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడు తూ..'మాణిక్‌రావు ఠాక్రే నాకు ఫోన్ చేశారు. అందుకే ఆయనతో భేటీ అయ్యేందుకు వచ్చా. నా నియోజకవర్గ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఇటీవల రాలేకపోయా. నేనెప్పుడూ గాంధీభవన్‌కు రానని చెప్పలేదు. కాంగ్రెస్‌ను ఎలా అధికారంలోకి తేవాలనే దానిపై భేటీలో చర్చించాం' అని తెలిపారు. సీఎం కేసీఆర్ ఏ క్షణమైనా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. అందువల్ల పార్టీని ఎన్నికలకు సిద్దం చేయాల్సిన అవసరముందని చెప్పారు. సోనియా రుణం తీర్చుకునేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 50, 60 మంది అభ్యర్థులను ముందే ప్రకటించాలని కోరారు. వచ్చే ఆరు నెలలు ప్రజా పోరాటాలు బలంగా చేయాలన్నారు. గాంధీభవన్‌లో సమావేశాలు తగ్గించి ప్రజల్లో ఉండాలంటూ ఠాక్రేకు వివరించినట్టు కోమటిరెడ్డి తెలిపారు.
ఠాక్రేతో పలువురు నేతల భేటీ
హాత్ సే హాత్ కార్యక్రమంపై చర్చించేందుకు రాష్ట్రానికి వచ్చిన ఠాక్రేతో పలువురు కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, మధుయాష్కీ,గౌడ్, అజమతుల్లా హుస్సేన్, దామో దర రాజనర్సింహ్మ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితర నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనగామ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మార్యాదపూర్వకంగా ఎంపీ కోమటిరెడ్డితో కలిసి మాణిక్‌రావు ఠాక్రేను కలిశారు. వారిని శాలువాలతో సత్కరించారు.
హన్మంతన్న అలక
మరోవైపు మాజీ ఎంపీ వి.హనుమంతరావు గాంధీభవన్ నుంచి అలిగి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. తాను ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ క్రికెట్ టోర్నీకి ఠాక్రేను వీహెచ్ ఆహ్వానించారు. బిజీ కార్యక్రమాల దృష్ట్యా రాలేకపోతున్నట్టు ఆయన సర్ది చెస్పే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేశ్‌కుమార్ జోక్యం చేసుకున్నారు. దీంతో మహేశ్కుమార్పై వీహెచ్ భగ్గుమన్నారు. వారిద్దరి మధ్య వాగ్వాదం కొనసాగింది. పార్టీ నేతలు సర్ది చెప్పినా వినకుండా హన్మంతన్న అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు.