Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ పాలకవర్గాల తీర్మానం
- ఫలించిన రైతుల, బాధితుల పోరాటం
నవతెలంగాణ-కామారెడ్డిటౌన్/ జగిత్యాలటౌన్
కామారెడ్డి, జగిత్యాల పట్టణ మాస్టర్ ప్లాన్స్ రద్దయ్యాయి.. స్థానికులు, రైతుల పోరాటంతో ప్రభుత్వం, పాలకవర్గాలు దిగొచ్చాయి. శుక్రవారం జరిగిన మున్సిపల్ పాలకవర్గాల సమావేశాల్లో ఇందుకు తీర్మానం చేశారు. కామారెడ్డి మున్సిపల్ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తున్నట్టు మున్సిపల్ శాఖ ప్రధాన అధికారి అరవింద్ కుమార్ ప్రకటించారు. శుక్రవారం అధికారులతో సమావేశమై మున్సిపల్ మాస్టర్‌ప్లాన్ డ్రాఫ్ట్‌ను పరిశీలించారు. అలాగే, కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ సమావేశం ఏర్పాటు చేశారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌ను రద్దు చేస్తున్నట్టు తీర్మానం చేశారు. నూతన మాస్టర్ ప్లాన్‌లో రైతుల పొలాలు పోతున్నాయని, 45 రోజులకుపైగా రైతులు నిరసన, ధర్నాలు చేస్తున్న సందర్భంలో వారికి అధికార పార్టీ తప్ప, కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, బీజేపీ తదితర పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతుల నిరసనల సమయంలోనే అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు పయ్యావుల రాములు చనిపోయారు. దాంతో రైతుల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. కౌన్సిలర్ల రాజీనామాలకు ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో చివరకు మున్సిపల్ ప్రధాన కార్యదర్శి కామారెడ్డి నూతన మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇది రైతుల విజయం..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అడ్లూరు గ్రామంలో రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు సమావేశమయ్యారు. కమిటీ నాయకులు మాట్లాడుతూ.. ఇది రైతుల విజయమని తెలిపారు. తదనంతరం టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దుపై మున్సిపల్ ఏకగ్రీవ తీర్మానం
జగిత్యాల పట్టణంలో నూతన మాస్టర్ ప్లాన్ ముసాయిదా(2041)ను రద్దు చేస్తూ మున్సిపల్ అత్యవసర సమావేశం నిర్వహించి కౌన్సిల్ సభ్యులు తీర్మానం చేశారు. రైతులు 15 రోజులుగా చేస్తున్న ఉద్యమం ఫలించింది. డిసెంబర్ 15న జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి అధ్యక్షతన కౌన్సిల్ సభ్యులు తీర్మానం చేశారు. మాస్టర్ ప్లాన్‌లో జగిత్యాల పరిసర గ్రామాలైన తిమ్మాపూర్, మోతే, తిప్పనపేట్, నర్సింగాపూర్, హస్నాబాద్, పలు గ్రామాల భూములను మాస్టర్ ప్లాన్‌లో కలుపుతూ ప్రవేశపెట్టారు. దాంతో భూములను కోల్పోతున్న రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఆయా గ్రామాల ప్రజలు ఏకతాటిపై జేఏసీగా ఏర్పడి ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో సర్పంచులతోపాటు వార్డు సభ్యులు రాజీనామాలకు సైతం సిద్ధపడ్డారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రాన్ని నాలుగు వైపులా నిర్బంధిస్తూ రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తూ కొత్త మాస్టర్ ప్లాన్ కాపీలను దగ్ధం చేశారు. వారికి అండగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీజేపీ నాయకులు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దాంతో పాలకవర్గం దిగొచ్చి మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తూ ప్రకటించింది.