Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోన్ సిగల్స్ ఆధారంగా అధికారుల నిర్ధారణ
- మరొకరి ఆచూకీ గల్లంతు
- సికింద్రాబాద్‌లో రెండో రోజూ శ్రమించిన రెస్క్యూ టీమ్స్
నవతెలంగాణ-సిటీబ్యూరో, బేగంపేట్
సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని దక్కన్ స్పోర్ట్స్ నిట్వేర్ మాల్లో గురువారం జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో ముగ్గురు మృతిచెందినట్టు అనుమానం వ్యక్తమవుతోంది. ప్రమాదం సమయంలో నలుగురిని అధికారులు రక్షించగా, బీహార్‌కు చెందిన ముగ్గురు కూలీలు జునైద్, వసీం, జహీర్ ఆచూకీ తెలియలేదు. శుక్రవారం మరోసారి సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. కూలీల సెల్‌ఫోన్ సిగల్స్ ప్రమాదం జరిగిన భవనంలోనే చూపిస్తుండటంతో వారు సజీవ దహనయమ్యే అవకాశముందని నిర్ధారణకు వచ్చారు. 22 అగ్నిమాపక వాహనాలతో మంటలను పూర్తిగా ఆర్పేసినప్పటికీ భవనంలో వేడి తీవ్రత అధికంగా ఉండటంతో రెస్క్యూ సిబ్బంది మాల్ లోపలకి వెళ్లలేకపోయారు. దాంతో శుక్రవారం డ్రోన్ కెమెరాలను పంపించి రెండు మృతదేహాలను గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. భవనం రెండో అంతస్తులో గుర్తుపట్టలేని స్థితిలో రెండు మృతదేహాలున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, అగ్నిప్రమాదంలో మొత్తం ముగ్గురు చనిపోయారని.. వీరి మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎముకలు, టీత్ పరీక్ష ద్వారానే వారు ఎవరనేది గుర్తించే అవకాశముంది. అగ్నిప్రమాదంపై కేసులు నమోదు చేసిన అధికారులు అన్ని కోణా ల్లో విచారణ చేపట్టారు. జీహెచ్ఎంసీ అధికారులు బిల్డింగ్‌ను పరిశీలించారు.
షార్ట్ సర్క్యూట్ కాదు.. : డీఈ
అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరగలేదని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డీఈ శ్రీధర్ తెలిపారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఏ అగ్నిప్రమాదం జరిగినా షార్ట్ సర్క్యూట్ మూలంగానే అనడం పరిపాటి అయిపోయిందన్నారు. మంటలు వ్యాపిస్తున్న సమయంలో మీటర్లలో కరెంటు సరఫరా ఉందని చెప్పారు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగే ఉంటే సబ్‌స్టేషన్‌లో ట్రిప్ అయ్యేదనీ, కానీ అలా జరుగలేదన్నారు. అలాగే మీటర్లు, తీగలు పూర్తిగా కాలిపోయేవన్నారు. తమ టెక్నికల్ టీం తనిఖీ చేసిన వివరాలు వెల్లడిస్తామన్నారు. సికింద్రాబాద్ టింబర్ డిపోలో ప్రమాదం, రూబీ హోటల్లో జరిగిన ప్రమాదంలోనూ ఎలక్ట్రిసిటీ మీటర్లు కాలిపోలేదన్నారు.
ఆ ఫైల్ ఎక్కడా?
డెక్కన్ మాల్ బిల్డింగ్‌కు సంబంధించిన ఫైల్ విషయంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారుల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. ఫైల్ తమ దగ్గర లేదంటే తమ దగ్గర లేదని అధికారులు వాదులాడుకున్నారు. అయితే, ఈ భవనంపై ఇప్పటికే నోటీసులు ఇచ్చామని ఓ అధికారవర్గం చెప్పడం గమనార్హం. మరోవైపు ఆ ఫైల్ దొరికితేనే కూల్చివేతకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.