Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయం జరిగే వరకు పోరాటం: సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
- రెండో రోజు బీఎన్ తిమ్మాపురం నిర్వాసితుల మహాధర్నా
నవతెలంగాణ- భువనగిరిరూరల్
బస్వాపురం రిజర్వాయర్లో సర్వం కోల్పోతున్న బీఎన్ తిమ్మాపురం గ్రామ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారమివ్వాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. వారి సమస్యలను పరిష్కరించాలని, ఆ తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టాలని అన్నారు.
యాదాద్రిభువనగిరి కలెక్టరేట్ ఎదుట భూనిర్వాసితులు చేపట్టిన మహాధర్నా రెండో రోజు శనివారం కొనసాగింది. వారికి చెరుపల్లి మద్దతు తెలిపి మాట్లాడారు. తిమ్మాపూర్ గ్రామస్తులు బస్వాపురం ప్రాజెక్టులో భూములు, ఇండ్లు అన్నీ కోల్పోతున్నారన్నారు. తమను అన్ని విధాలా ఆదుకోవాలని 52 రోజులుగా ప్రాజెక్టు క్యాంపు కార్యాలయం దగ్గర కట్టపై దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలవాలని, భూములకు పాత అవార్డును తొలగించి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ సర్వేలో పాల్గొన్న కుటుంబంలోని ప్రతి సభ్యునికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.
రైతు సంఘం (సీపీఐ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ధర్నాకు మద్దతు తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే బాధ్యత తీసుకొని నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే నిర్వాసితులందరినీ కూడగట్టి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామం నుంచి ఉపాధి కోసం వలస వెళ్లిన వారికి కూడా ఆర్అండ్ఆర్ ప్యాకేజి అమలు చేయాలని, యాదాద్రి టెంపుల్లో కానీ రిజర్వాయర్లో కానీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కల్లూరి మల్లేశం, దాసరి పాండు, ఏశాల అశోక్ మాట్లాడారు. పట్టా భూములకు, ప్రభుత్వ భూములకు ఒకేసారి నష్టపరిహారం కింద డబ్బులు చెల్లించాలని, వ్యవసాయ కూలీలందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వృత్తిదారులకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..: కలెక్టర్ పమేలా సత్పతి
భూనిర్వాసితుల సమస్యలు న్యాయమైనవని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ పమేలా సత్పత్తి హామీ ఇచ్చారు. కలెక్టర్ కార్యాలయం పరిధిలో ఉన్న సమస్యలను తక్షణం పరిష్కారం చేస్తామని, ప్రభుత్వంతో ముడిపడి ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే విధంగా బాధ్యత తీసుకుంటామని చెప్పారు.
భూనిర్వాసితుల కమిటీ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు సర్పంచ్ పిన్నం లతారాజు, ఎంపీటీసీ ఉడత శారద ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ అధ్యక్షత వహించారు.
ఈ ధర్నాలో సింగిల్ విండో మాజీ చైర్మెన్ ఎడ్ల సత్తిరెడ్డి, ఉప సర్పంచ్ ఎడ్ల దర్శన్రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ రావులఅనురాధ నందు, మాజీ ఎంపీటీసీ జిన్న మల్లేష్, వల్డసు రాజు, కాళభైరవ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు, లాయర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మామిడి వెంకటరెడ్డి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గొరిగే సోములు తదితరులు పాల్గొన్నారు.