Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏసీడీ డ్యూ, డెవలప్మెంట్ చార్జీలపై ఆగ్రహం
- ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు సరికాదని విన్నపం
- ఇవి విద్యుత్ ప్రయివేటీకరణ యత్నాలేనని ఆరోపణ
- దన్నుగా సీపీఐ(ఎం), ఎన్డీ, ప్రజాపంథా పార్టీలు
- ఖమ్మంలో విద్యుత్ నియంత్రణ మండలి వినియోగదారుల ముఖాముఖి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
విద్యుత్ వినియోగదారులు సమస్యలను ఏకరువు పెట్టారు. అడిషనల్ కన్జప్షన్ డిపాజిట్ (ఏసీడీ) డ్యూ, డెవలప్మెంట్ చార్జీల పేరుతో వినియోగదారులపై భారాలు మోపొద్దని డిమాండ్ చేశారు. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు సరికాదని విన్నవించారు. సంస్థ నష్టాల్లో ఉందనే పేరుతో వాటిని భర్తీ చేసుకునేందుకు వినియోగ దారులపై భారాలు వేయడం సరికాదని, ఇవన్నీ విద్యుత్ ప్రయివేటీకరణ చర్యల్లో భాగమేనని సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ప్రజా పంథా నాయకులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా విద్యుత్ వినియోగదారుల తో ముఖాముఖిని శనివారం స్థానిక జిల్లా పంచాయతీ మౌలిక వనరుల కేంద్రం (డీపీఆర్సీ) భవన్లో తన్నీరు శ్రీరంగారావు అధ్యక్షతన టెక్నికల్ మెంబర్ మనోహర్‌రాజు, మెంబర్ ఫైనాన్స్ బండారు కృష్ణయ్య నేతృత్వంలో నిర్వహించారు.
విద్యుత్ వృథాను అరికట్టేందుకే మీటర్లు: శ్రీరంగారావు, అధ్యక్షులు
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పేరుతో విచ్చలవిడిగా వృథాకు పాల్పడుతున్న నేపథ్యంలోనే ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడుతున్నట్టు అధ్యక్షులు శ్రీరంగారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 27 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉండగా 5 లక్షలకు పైగా ట్రాన్స్ఫార్మర్లు ఉండగా, ఆరు వేల ట్రాన్స్ఫార్మర్లకు మాత్రమే ప్రయోగాత్మకంగా మీటర్లు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్‌పరంగా ఏవైనా సమస్యలు ంటే 040-23311127, 28 నంబర్లకు ఫోన్ చేయాల్సిందిగా సూచించారు. పనిచేయని మీటర్లను ఏడురోజుల్లో మార్చాలని ఆదేశించారు. లేనిపక్షంలో సంబంధిత శాఖ బాధ్యులు రోజుకు రూ.200 చొప్పున ఫెనాల్టీ సంస్థకు చెల్లించాల్సి ఉంటుంద న్నారు. ప్రీపెయిడ్ మీటర్లు వచ్చేంత వరకే ఏసీడీ చార్జీలు అమల్లో ఉంటాయని టెక్నికల్ మెంబర్ మనోహర్‌రాజు తెలిపారు. ఏప్రిల్‌లో ఏసీడీ చార్జీల స్పెషల్ డ్రైవ్ ఉంటుందన్నారు. చార్జీల టారిప్ ఉండదని స్పష్టం చేశారు.
సమావేశంలో సంస్థ సీజీఆర్ఎఫ్ చైర్మెన్ సత్యనారాయణగౌడ్, జిల్లా ఎస్ఈ సురేందర్, డైరెక్టర్లు బుగ్గవీటి వెంకటేశ్వరరావు, గణపతి, సభ్యులు తిరుమలరావు, చరణ్‌దాస్, నరేందర్, కార్పొరేటర్లు కమర్తపు మురళి, కూరాకుల వలరాజు, రాపర్తి శరత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మిక్కిలినేని నరేందర్, ఎన్డీ జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్, చందు తదితరులు పాల్గొన్నారు.
ప్రయివేటీకరణ యత్నాలు: సీపీఐ(ఎం)
గతేడాది డెవలప్మెంట్ చార్జీలు, ఇప్పుడు అడిషనల్ కన్జప్షన్ డ్యూ పేరుతో పేద, మధ్యతరగతి వినియోగదారులపై భారాలు వేస్తున్నారని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. జిల్లావ్యాప్తంగా 1017 మంది సిబ్బందితో సంస్థ నిర్వహణ కష్టతరం అవుతున్న దృష్ట్యా స్టాఫ్‌ను పెంచి మరింత నాణ్యమైన విద్యుత్ ను వినియోగదారులకు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(డిస్కాం) లకు విద్యుత్ నియంత్రణ మండలి ఇస్తున్న మితిమీరిన స్వేచ్ఛ ఫలితంగా వినియోగదారులపై భారాలు అధికమవు తున్నా యని ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలు రూ.వేల కోట్లలో విద్యుత్ బకాయిలున్నా చర్యలు తీసుకోని నియంత్రణ మండలి.. ప్రజలపై భారాలు వేయడంలో మాత్రం ముందుంటోందన్నారు. ఆర్టిజన్స్‌ను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు కాలితే 48 గంటల్లో రీప్లేస్ చేయాలని కోరారు. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల కు మీటర్లు పెట్టడం వంటి చర్యలు ఉపసంహరిం చుకోవాలని, లోటుపాట్ల పేరుతో విద్యుత్ ప్రయివేటీకరణకు పూనుకోవడం సరికాదన్నారు. పలువురు సర్పంచ్‌లు సైతం లైన్ల విస్తరణ పేరుతో గ్రామపంచాయతీలపై భారాలను వ్యతిరేకిం చారు. ఇష్టానుసారంగా ఎల్సీలు ఇవ్వకుండా నిర్ధిష్ట సమయంలోనే ఇచ్చేలా చూడాలని మరికొందరు వినియోగదారులు కోరారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల బిల్‌స్టాప్ సర్వీసులను పునరుద్ధరించాలని తెల్దారు పల్లి సర్పంచ్ సిద్దినేని కోటయ్య కోరారు. జామా యిల్, సుబాబుల్ తోటల మధ్య నుంచి పోతున్న కరెంట్ లైన్లను తొలగించాలని సభ్యులు నరేందర్ కోరారు. పల్లెప్రగతిలో ఇనుప స్తంభాలను తొలగించి నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీఆర్ఎస్ నేతలు పగడాల నాగరాజు, డీసీఎంఎస్ చైర్మెన్ రాయల శేషగిరిరావు కృతజ్ఞతలు తెలిపారు.