Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన డిమాండ్
- పడిపోయిన ఎగుమతులు
- దిగుమతులపై సుంకం భారం
- మద్దతు ధర రూ.12 వేలు ఇవ్వాలంటూ రైతుల డిమాండ్
- జాడ లేని సీసీఐ
- నడవని జిన్నింగ్ మిల్లులు
- క్వింటాల్ ధర రూ.8 వేలు మించట్లే..
- అధిక వర్షాల వల్ల తగ్గిన పంట దిగుబడి
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
పత్తి ధర ఒక్కసారే ఢమాల్ అని పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడం, కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధర పెంచకపోవడం వంటి కారణాల వల్ల ప్రస్తుతం పత్తికి ధర పలకట్లేదు. గతేడాది వచ్చిన ధరలో సగం కూడా రాకపోయే సరికి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క అధిక వర్షాల వల్ల పంట నష్టమేర్పడి దిగుబడులు తగ్గితే.. చేతికొచ్చిన పత్తికి కనీస ధర రాకపోయే సరికి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధర పెంపు, సీసీఐ కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పటికైనా ధర పెరగకపోదా అన్న ఆశతో పత్తిని ఇండ్లల్లోనే నిల్వ చేసుకున్నారు. రూ.12 వేల మద్దతు ప్రకటించి సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 502000 ఎకరాల్లో పత్తి సాగైంది. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 3.44 లక్షల ఎకరాలు, మెదక్ జిల్లాలో 48 వేల ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సగటున 30 లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. రెండేండ్లుగా వరి పంటను తగ్గించి వర్షాధారిత పంటలైన పత్తి సాగు పెంచాలని అధికారులు అవగాహన కల్పించడం, గతేడాది పత్తికి మంచి ధర రావడంతో ఈ ఏడాదిలో సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో పత్తి సాగు బాగా పెరింది. అయితే, సాగు సీజన్ మొదటి నుంచి పూత, కాత దశ వరకు భారీ వర్షాలు, వరదల వల్ల పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. వచ్చిన దిగుబడికి కనీస ధర లభించకపోవడంతో రైతులు మరింత నష్టపోతున్నారు. పత్తి సీజన్ మొదట్లో ధర కొంత బాగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత ధర తగ్గుతూ వచ్చింది. సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో జిన్నింగ్ మిల్లులు, వ్యాపారులు సైతం తక్కువ ధరకే కొనుగోలు చేస్తుండటం వల్ల రైతులు పత్తిని అమ్ముకోలేక ఇండ్లల్లో నిల్వ చేసుకున్నారు. సీజన్ ముగుస్తున్నా ధర పెరగకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇదే విధంగా ఉంది.
నడవని జిన్నింగ్ మిల్లులు
పత్తి సీజన్ మొదలవ్వగానే కొనుగోళ్లు ప్రారంభించాల్సిన సీసీఐ ఇప్పటి వరకు జాడలేదు. జిన్నింగ్ మిల్లుల్లోనే కొనుగోలు చేస్తారని ప్రకటన చేసినప్పటికీ ఎక్కడా కొన్నది లేదు. కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర రూ.6,380 మాత్రమే సీసీఐ కొనుగోలు చేయాలి. అంత కంటే ఎక్కువ ధర మార్కెట్లో వ్యాపారులు పెడుతున్నందున రైతులు అటువైపే మొగ్గుచూపడం వల్ల సీసీఐ కొనుగోలు చేయకుండా చేతులు దులుపుకుంది. జిన్నింగ్ మిల్లుల్లోనూ పత్తి కొనుగోళ్లు సాగట్లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 45 జిన్నింగ్ మిల్లులున్నాయి. సంగారెడ్డిలో 19, సిద్దిపేటలో 25 మిల్లులున్నాయి. అంతర్జాతీయం మార్కెట్లో పత్తికి డిమాండ్ తగ్గడంలో మిల్లర్లు కూడా కొనట్లేదు. దీంతో రైతులు పత్తిని ఇండ్లల్లో నిల్వ చేశారు. ఒక్కో రైతు ఇంట్లో 20 క్వింటాళ్ల నుంచి వంద క్వింటాళ్ల వరకు నిల్వ చేశారు.
గతేడాది కంటే సగం ధర
గతేడాది పత్తి క్వింటాల్‌కు రూ.14 వేల వరకు వచ్చింది. అదే ఆశతో రైతులు ఈసారి సాగు విస్తీర్ణం పెంచారు. ఈసారీ మొదట్లో బాగానే ఉన్నా.. పత్తి మార్కెట్‌కు రావడం పెరిగే సరికి ధర ఒక్కసారే పడిపోయింది. ఈ ఏడాది ముందస్తుగా సాగు చేసిన రైతులు పంట తొలుత ఏరి అమ్ముకుంటే రూ.9,500 వరకు పలికింది. గతేడాది కంటే నాలుగైదు వేలు తగ్గినా పర్వాలేదు అనుకున్న రైతులు పత్తిని మార్కెట్‌కు తీసుకెళ్లే కొద్ది ధర తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం రూ.7,500 నుంచి రూ.8,100 కంటే ఎక్కువ రావట్లేదు. ఇండ్లల్లో ఉన్న పత్తి నిల్వల్ని ఎలా అమ్ముకోవాలో అంతుచిక్కక రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు.
తగ్గిన దిగుబడులు..పెరిగిన పెట్టుబడి
ఈ ఏడాది పత్తి పెట్టుబడులు పెరిగాయి. జూన్, జులైలో పత్తి విత్తనం వేశాక భారీ వర్షాలు, వరదలొచ్చాయి. దీంతో పత్తి చేళ్లలన్నీ జాలువారిపోయాయి. మొలకెత్తకపోవడంతో రెండు మూడు సార్లు విత్తుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పైర్లు పెరుగుతున్న క్రమంలోనూ వరుసగా వర్షాలు పడటంతో కలుపు పెరిగిపోయింది. పూత, కాత దశలోనూ వర్షాలు పడటంతో రాలిపోయింది. అధిక తెగుళ్లు ఆశించడం వల్ల పురుగు మందులు నాలుగైదు సార్లు పిచికారీ చేయడంతో ఎకరాలకు రూ.పది వేల వరకు ఖర్చు పెరిగింది.
వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయి. పైర్లకు నష్టమేర్పడటం వల్ల ఐదారు క్వింటాళ్ల దిగుబడే వచ్చిందని రైతులు పేర్కొంటున్నారు. మిట్ట ప్రాంతాల్లో వర్షాల వల్ల నష్టమేర్పకుండా పైర్లు బాగానే ఉన్న చోట ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది.
అంతర్జాతీయంగా తగ్గిన డిమాండ్
అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ తగ్గింది. పత్తి బేల్ రేటు రూ.1.14 లక్షల నుంచి రూ.65 వేలకు పడిపోయింది. దేశ వ్యాప్తంగా 30 శాతం జిన్నింగ్ మిల్లులు నడుస్తలేవు. దీంతో దారం(యార్న్) కూడా అమ్మడుపోవడం లేదు. దారం ధర సగటున కిలోకు రూ.200 తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో బేళ్లను గోదాముల్లో నిల్వ చేసే పరిస్థితి పోయి దారం నిల్వ చేయాల్సి వస్తుందంటున్నారు. పత్తి బేళ్లు దారంతోపాటు గింజల ధరలు కూడా బాగా తగ్గిపోయాయి. సీజన్ మొదట్లో గింజలు టన్నుకు 38 వేల నుంచి రూ.40 వేలు ఉండగా ప్రస్తుతం రూ.33 వేలు కూడా లేదంటున్నారు. ముఖ్యంగా దేశంలోని తమిళనాడుతో పాటు అంతర్జాతీయ మార్కెట్ అయిన బ్రెజిల్, బంగ్లాదేశ్, చైనా, వియత్నాం, ఆఫ్రికా, యూరప్ దేశాల్లో కూడా డిమాండ్ లేదని జిన్నింగ్ మిల్లుల యజమానులు, వ్యాపారులు పేర్కొంటున్నారు.
దిగుమతులపై సుంకం భారం
కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై 11 శాతం సుంకం విధించింది. ఒక్కో క్యాండీకి రూ.7 నుంచి 8 వేల భారం పడటంతో దారం దిగుమతులు నిలిచిపోయాయి. సుంకం చెల్లించడం భారమని చెప్పి వ్యాపారులు స్థానికంగా ఉన్న బేళ్లు, దారాన్నే కొంటున్నారు. గార్మెంట్ తయారీకి దేశీయ పత్తినే వినియోగిస్తున్నారు. మరో పక్క గార్మెంట్ ఎగుమతులకు గిరాకీ లేదు. ప్రధాన మార్కెట్ అయిన బంగ్లాదేశ్ దగ్గర యూరప్ దేశాలు కొనడం లేదు. తక్కువ ధరకు ఇస్తున్న ఆస్ట్రేలియా, బ్రెజిల్ నుంచే కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
మద్దతు ధర రూ.12 వేలివ్వాలి
గొల్లపల్లి జయరాజు- సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి
పత్తికి క్వింటాల్‌కు రూ.12 వేలు ఇవ్వాలి. సీసీఐ ద్వారా పండిన పత్తినంతా కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధర రూ.6380 మాత్రమే ప్రకటించింది. దీంతో సీసీఐకి రైతులెవ్వరూ అమ్మట్లేదు. మార్కెట్లో వ్యాపారులు పది వేలలోపుకు కొంటుంటే సీసీఐ మాత్రం రూ.6380కే కొంటామనడం సరికాదు. పత్తి సాగు పెరుగుతున్నందున కేంద్రం మద్దతు ధరను పెంచాలి. రైతుల ఇండ్లల్లో క్వింటాళ్ల కొద్ది పత్తి నిల్వలున్నాయి. వెంటనే ధర పెంచి కొనుగోలు చేయాలి.
ధర లేకనే నిల్వ చేసుకుంటున్నాం
గ్రామంలో 10 ఎకరాల వరకు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాను. 75వేల క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చింది. మార్కెట్లో సరైన ధర లేని కారణంగా పత్తిని విక్రయించకుండా ఇంట్లో నిల్వ చేశాను. ధర పెరుగుతుందనే ఆశతో ఉన్నాం. కనీసం క్వింటాల్‌కు రూ.10వేల వరకైనా పెంచితే బాగుంటుంది.
కిల్చెట్టి సంతోష్- చెప్రాల- బేల మండలం- ఆదిలాబాద్ జిల్లా
కౌలుకు సరిపోవట్లేదు
ఐదెకరాలు స్వంత భూమితో పాటు ఏడెకరాలు కౌలుకు సాగు చేశా. 70 క్వింటాళ్ల పత్తి పండింది. అమ్ముకుంటే కౌలు, పెట్టుబడిపోగా ఏమీ మిగల నట్టుంది. పోయినేడు క్వింటాకు రూ.14 ధర వచ్చింది. ఇప్పుడేమో రూ.7వేలే అంటున్నరు. తక్కువ ధరకు అమ్మితే పంట సాగు కోసం చేసిన అప్పు, కౌలు, ఆరుగాలం కష్టం ఏం కావాలి. బయటి దేశాలకు పత్తి పోతలేదని మిల్లుల్లో ధర పెడతలేరు. ధర లేదని నిల్వ చేసినం. ఎంత కాలం పంటను దాచుకోవాలి. ప్రభుత్వం పత్తికి ధర రూ.12 వేలు ఇవ్వాలి.
- రైతు బాలయ్య
ఐదెకరాల్లో పత్తేసిన ధరలేదు : రైతు డాకయ్య
సొంత భూమి రెండెకరాలు, కౌలుకు మూడెకరాల్లో పత్తి వేసిన. 15 క్వింటాళ్ల పత్తి వెళ్లింది. అమ్ముదామంటే ధర లేదు. క్వింటా ఏడు వేలకే అడుగుతున్నరు. రెండు సార్లు విత్తనాలు విత్తిన. పురుగుమందుల ఖర్చు రెండింతలైంది. వర్షాల వల్ల దిగుబడి తగ్గింది. పంట సాగు ఖర్చు పెరిగి, దిగుబడి తగ్గి బాధపడుతున్న వేళ ఉన్న ధర పడిపోయే సరికి గుండె ఆగేంత పనైంది. సర్కారే ధర పెంచి కొనాలి. లేదంటే రైతు వ్యవసాయం మానేయాల్సి వస్తది.