Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు హైదరాబాద్‌కు 'చే' కుమార్తె డాక్టర్ అలైదా గువేరా
- ఆమెతోపాటు మనవరాలు ప్రొఫెసర్ ఎస్తేఫానియా గువేరా
- ఘన స్వాగతం పలకనున్న ఎన్సీఎస్సీ-ఐప్సో
- రవీంద్రభారతిలో క్యూబా సంఘీభావ సభ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచ విప్లవ యోధుడు చే గువేరా.. పీడితులు, తాడితుల పక్షాన అవిశ్రాంతంగా పోరాడి... అమెరికా సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన మహోన్నత నేత. 'సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిద్దాం.. ప్రపంచ శాంతిని కాపాడుకుందాం...' అంటూ ఆయన ఇచ్చిన సందేశం నాటికీ, నేటికీ.. ఏనాటికీ అనుసరణీయం. ఆ సందేశంతోపాటు 'చే' చూపిన పోరాట మార్గాన్ని, దాని స్ఫూర్తిని నరనరాన నింపుకున్నారు ఆయన కుమార్తె డాక్టర్ అలైదా గువేరా. తన ఏడో ఏటనే సామ్రాజ్యవాదులు నాన్నను పొట్టనబెట్టుకున్నా... అమ్మ పెంపకంలో, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫెడల్ కాస్ట్రో దిశా నిర్దేశనంలో స్వతంత్ర భావాలతో పెరిగి విద్యార్థి, యువజనోద్యమాలతో రాటుదేలిన ఆమె... ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఆమె ఆదివారం హైదరాబాద్‌కు విచ్చేయనున్నారు. నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా (ఎన్సీఎస్సీ)-ఐప్సో సంయుక్తాధ్వర్యంలో అలైదాకు ఘన స్వాగతం పలకనున్నారు. ఆమెతోపాటు ఆమె కుమార్తె, 'చే' మనవరాలు ప్రొఫెసర్ ఎస్తేఫానియా గువేరా కూడా హైదరాబాద్‌కు రానున్నారు. అలైదా గతంలో ఇండియాలో పర్యటించగా.. ఎస్తేఫానియా తొలిసారి మన దేశంలో అడుగుపెడు తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం నగరంలోని రవీంద్రభారతిలో 'క్యూబా సంఘీభావ సభ'ను నిర్వహించనున్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాసగౌడ్తోపాటు ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, జస్టిస్ రాధారాణి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, ప్రొఫెసర్ హరగోపాల్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రజా కళాకారిణి విమలక్క తదితరులు ఆ సభకు హాజరుకానున్నారు. సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, పలు పత్రికల సంపాదకులు కూడా సభలో పాల్గొంటారు. ప్రస్తుత బీజేపీ పాలనలో మనదేశం అత్యంత సంక్లిష్ట, సంక్షుభిత పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ సభను జయప్రదం చేయటం ద్వారా అటు పెట్టుబడిదారీ విధానాన్ని, మతోన్మాదాన్ని వ్యతిరేకించటంతోపాటు ఇటు సామ్రాజ్యవాద ప్రతిఘటనా పోరులో భాగస్వాములు కావాలని ఆ సభ కో ఆర్డినేటర్లు ఎన్.బాలమల్లేశ్, డిజి నర్సింహారావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.