Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పసుపుబోర్డును ఏర్పాటు చేసి, ఆ రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వ్యాపారస్తులంతా కుమ్మకై పసుపు ధరను ఒకేసారి క్వింటాలుకు రూ.5వేల నుంచి రూ.5,500 వరకు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని పేర్కొంది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో రైతులు భారీగా నష్టపోతున్నారని వివరించింది.
ఈమేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సీజన్లో పసుపు మార్కెట్కు రావడం ప్రారంభమైందనీ, రైతుల నిస్సహాయ స్థితిని దృష్టిలో ఉంచుకుని వ్యాపారస్తుల ఇలాంటి దుర్మార్గానికి ఒడిగడుతున్నారని విమర్శించారు. 2012లో పసుపు క్వింటాలు ధర రూ.15వేలు ఉండేదని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ధర పెరగలేదు కానీ భారీగా ఉత్పత్తి ఖర్చు పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎకరానికి రూ. 1,25,000 నుంచి రూ. 1,50,000 వరకు కనీస ఖర్చు చేస్తుండగా, ఇదే సమయంలో ఈ సంవత్సరం ఉత్పాదకత కూడా బాగా తగ్గుతుందని పేర్కొన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో సగం పెట్టుబడిని కూడా రైతులు రాబట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ద్వారా పసుపును కొనిపించి, ప్రాసెస్చేసి అమ్మించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయోత్పత్తులు, టెక్స్టైల్స్, హ్యాండిక్రాప్స్ లాంటి ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు జాతీయ సహకార ఎగుమతి సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రం నుంచి వ్యవసాయోత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యవసాయోత్పత్తులను సేకరించి, శుద్ధిచేసి, ఎగుమతి చేసేందుకు ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. రైతుల సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దేందుకు చట్టబద్దమైన కనీస మద్దతు ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిచో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పోరాటాలకు సన్నద్ధమవుతామని హెచ్చరించారు.