Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్జీహెచ్ఎంఏ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధానోపాధ్యాయుల (హెచ్ఎం) బదిలీ గరిష్ట కాలపరిమితి ఐదేండ్లు కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం (టీఎస్జీహెచ్ఎంఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్ రాజగంగారెడ్డి, కోశాధికారి బి తుకారం శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ఒకే పాఠశాలలో ఉండే గరిష్ట కాలపరిమితి ఐదేండ్లకు బదులుగా ఎనిమిదేండ్లు ఉండేలా ప్రభుత్వం నిర్ణయించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల దూర ప్రాంతాల నుంచి దగ్గరి ప్రాంతాలకు బదిలీ కోరుకునే వారికి అవకాశాలు సన్నగిల్లాయని తెలిపారు. మారుమూల ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల దగ్గరికి బదిలీ కోరుకునే హెచ్ఎంల ఆశలు నీరుగారిపోతాయని పేర్కొన్నారు. మెజార్టీ ప్రధానోపాధ్యాయుల్లో బదిలీలపై నిరాశ, నిస్పృహలు ఏర్పడతాయని వివరించారు. అందరికీ మంచి అవకాశాలు కల్పించాలనే అంశానికి విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాత పద్ధతిలో ఉన్నట్టుగానే ఒకే పాఠశాలలో ఐదేండ్ల సర్వీసు నిండిన హెచ్ఎంలను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.