Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.13,750 కోట్ల విలువ గల 64.30 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ: మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా పూర్తి చేశామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 7,024 కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో రూ.13,750 కోట్ల విలువ గల 64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు చెప్పారు. శనివారం హైదరాబాద్లో ఉన్నతాధికారులుతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 21న ప్రారంభమైన వానాకాలం పంట సేకరణ మూడు నెల్లకుపైగా 94 రోజులు పాటు కొనసాగిన ఈ ప్రక్రియలో 9 లక్షల 76 వేల మంది రైతుల నుండి సేకరించి,. ఓపీఎంఎస్లో నమోదైన రూ.12,700 కోట్లను చెల్లించామని వివరించారు.
మిగతావారికి సైతం వారం రోజుల్లోనే డబ్బులు అందజేస్తామని స్పష్టం చేశారు. 16 కోట్ల గన్నీ బ్యాగులు ఉపయోగించా మనీ, మరో ఐదున్నర కోట్ల బ్యాగులు అదనంగా అందుబాటులోకి ఉంచామని గంగుల తెలిపారు. వానాకాలంలో లేటుగా నాట్లేసిన వారి కోసం ఈ నెల 24 వరకు ధాన్యాన్ని అమ్ముకునే వెసులుబాటు కల్పించామని చెప్పారు. ఈ వానాకాలంలో నిజమాబాద్లో అత్యధికంగా 5.86 లక్షల మెట్రిక్ టన్నులు, అత్యల్పంగా ఆదిలాబాద్ లో 2,264 మెట్రిక్ టన్నులు సేకరించినట్టు మంత్రి ప్రకటిం చారు. ఈ ధాన్యం సీఎంఆర్ ప్రక్రియ సైతం వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణకు సహకరించిన రైతులు, హమాలీలు, ప్యాక్స్, ఐకేపీ యంత్రాంగం, సివిల్ సప్లైస్ అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, జాయింట్ కమిషనర్ ఉషారాణి, పౌరసరఫరాల సంస్థ జీఎం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.