Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అర్హులందరికీ దళిత బంధు పథకం అందుతుందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. త్వరలోనే విధి విధానాల నిర్ణయం జరుగుతుందన్నారు. కొందరు కోర్టుకు వెళ్లడంతోనే అంతరాయం ఏర్పడిందని చెప్పారు. శనివారం హైదరాబాద్ లోని మంత్రుల సముదాయంలో అల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దళితబంధు ఓ మహాయజ్ఞంలా కొనసాగుతున్నదని చెప్పారు. అందరికి ఒకే సారి అందివ్వటం కుదరదనీ, విడతల వారీగా అందిస్తామని తెలిపారు. దీని కోసం బడ్జెట్ లో కోట్లాది రూపాయలు విడుదల చేశామన్నారు. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేల సహకారంతో దళిత బంధు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం పట్ల ఎలాంటి అపోహలు నమ్మోద్దని సూచించారు. పార్టీలకతీతంగా లబ్ది దారులను గుర్తించి పథకాన్ని వర్తింప చేస్తున్నామని చెప్పారు. దళితుల్లో ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధిం చేందుకు దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. 119 నియోజవర్గాల్లో దళిత బంధు పథకం అమలు జరుగుతుందని మంత్రి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అలిండియా షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సోసైటీ జాతీయ గౌరవ అధ్యక్షులు ముత్తన్న, సెక్రటరీ జనరల్ బాలకృష్ణ, జగన్నాధం, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష, కళ్యాణ్, సుబ్బారావు, ప్రభాకర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.