Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 రోజుల్లో 2.82 కోట్ల మంది ప్రయాణం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం రూ.165.46 కోట్లు వచ్చింది. 11 రోజల్లో 2.82 కోట్ల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. గత ఏడాదికంటే ఈసారి సంక్రాంతి సీజన్లో రూ.62.29 కోట్లు అదనంగా ఆదాయం వచ్చినట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే గతేడాది ఆర్టీసీ టిక్కెట్ రేట్లకు, ఇప్పుడు వివిధ సెస్‌లు పేరుతో పెరిగిన టిక్కెట్ రేట్లకు మధ్య భారీ వ్యత్యాసమే ఉంది. ఈనెల 10 నుంచి 20వ తేదీ వరకు 11రోజుల్లో ఈ ఆదాయం వచ్చింది. ఒకేసారి రానూపోనూ టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకుంటే ప్రయాణీకులకు 10 శాతం రాయితీని ఈ సారి ఆర్టీసీ కల్పించింది. ఈసారి కూడా పండుగ సీజన్లో రోజువారీ సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడిపారు. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 3.57 కోట్ల కిలోమీటర్ల మేర టీఎస్ఆర్టీసీ బస్సులు తిరిగాయి. గత ఏడాదికంటే 26.60 లక్షల కిలోమీటర్లు అదనంగా తిరిగాయి. రోజుకు సగటున 2.42 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు నడిచాయి. ఆక్యూపెన్సీ రేషియో (ఓఆర్) గతేడాది సంక్రాంతి సీజన్లో 59.17 శాతం ఉండగా, ఈసారి 71.19 శాతానికి పెరిగినట్టు తెలిపారు. సాధారణ చార్జీలతోనే 3923 ప్రత్యేక బస్సులను నడిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్ని ఆదరించిన ప్రయాణీకులకు సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. పక్కా ప్రణాళికతో ప్రజలకు సేవల్ని సమర్థవంతంగా అందిచగలిగామని వారు పేర్కొన్నారు. ఆర్టీసీకి సహకారాన్ని అందించిన రాష్ట్ర రవాణా, పోలీసు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) అధికారుల సహకారం, సమన్వయంతో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామనీ, వారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు.