Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారం రోజుల్లో వివరాలు తెలపాలి
- ఫిబ్రవరిలో ప్రజారోగ్య పరిరక్షణ సభ
- టీఎస్ఎంసీకి హెచ్ఆర్డీఏ వార్నింగ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అర్హత లేకుండా మందులను సిఫారసు చేస్తున్న నకిలీ డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వారం రోజుల్లో తెలపాలని హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ), తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ)ని డిమాండ్ చేసింది. ఈ మేరకు హెచ్ఆర్డీఏ అధ్యక్షులు డాక్టర్ కె.మహేశ్ కుమార్ టీఎస్ఎంసీ రిజిస్ట్రార్, యాంటీ-క్వాకరీ కమిటీ చైర్మెన్‌కు లేఖ రాశారు. గతంలో ఐదు దఫాలుగా ఆధారాలతో సహా తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని కోరారు. ఎన్ఎంసీ సెక్షన్ 34, తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 20,21,22 సెక్షన్ల ప్రకారం క్రిమినల్ ప్రొసీడింగ్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదులను టీఎస్ఎంసీతో పాటు డైరెక్టర్ ఆఫ్ హెల్త్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శికి పంపించినట్టు వెల్లడించారు. అన్ని మెడికల్ కాలేజీల విద్యార్థులు, డాక్టర్లతో సంప్రదించిన తర్వాత ఫిబ్రవరి రెండో లేదా మూడో వారంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద గల ధర్నాచౌక్‌లో ప్రజారోగ్య పరిరక్షణ సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రగతిభవన్‌లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే జిల్లాల వారీగా యాంటీ-క్వాకరీ కమిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ ఎన్నికల కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ఎంబీబీఎస్ ఎంఎల్‌హెచ్‌పీలకు వేతనం పెంచాలనీ, ప్రాథమిక ఆరోగ్య రంగం బలోపేతానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలనీ, టీవీవీపీ స్సెషలిస్ట్ డాక్టర్ల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. క్లినిక్కులు, ఆస్పత్రుల అనుమతులు, రెన్యూవల్స్ కోసం జీవో నెంబర్ 47, జీవో నెంబర్ 48 అమలు చేయాలని, ఎంహెచ్ఎస్ఆర్బీ ద్వారా క్యాలెండర్ ఇయర్ రిక్రూట్ మెంట్ షెడ్యూల్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఫలితాలేవి....
డాక్టర్ల సంఘాలు నకిలీ వైద్యం, నకిలీలపై ఇచ్చిన ఫిర్యాదులపై టీఎస్ఎంసీ తీసుకున్న చర్యలేంటని తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ (టీడీఎఫ్) కన్వీనర్ డాక్టర్ విజయేందర్ ప్రశ్నించారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన విడుదల చేశారు. పలు సార్లు చట్ట విరుద్ధంగా ఏర్పాటైన వాటిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేశారు. ఫిర్యా దుతో వస్తున్న ఫలితాలేంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు.