Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్లు నిండిన హెచ్ఎంలను తప్పనిసరిగా బదిలీ చేయాలి: టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయులకు కనీస సర్వీసు నిబంధన లేకుండా అందరికీ బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక స్టేషన్లో ఐదేండ్ల సర్వీసు పూర్తైన ప్రధానో పాధ్యాయుల (హెచ్ఎం)ను తప్పనిసరిగా బదిలీ చేయాలని కోరింది. గతేడాది 317 జీవో అమల్లో భాగంగా ఇతర జిల్లాలకు కేటాయించిన టీచర్లను మారుమూల ప్రాంతాల్లో నియమించారని తెలిపారు. ప్రస్తుతం జరిగే సాధారణ బదిలీల్లో వారికి అవకాశం కల్పించాలంటూ అన్ని సంఘాలూ కోరినా విద్యాశాఖ అంగీకరించకపోవటం సమంజసం కాదని పేర్కొ న్నారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు కొనసాగు తున్నాయి కాబట్టి వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వానికి నష్టమేం లేదని వివరించారు.
హెచ్ఎంలు ఒక పాఠశాలలో ఐదేండ్లకు మించి పని చేయించకూడదంటూ గతంలో నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఏ ఉపాధ్యాయ సంఘం అడగకుండానే ఎనిమిదేండ్ల వరకు ఒకే పాఠశాలలో కొనసాగించే అవకాశమివ్వటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని తెలిపారు. ఎవరో కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనం కోసం వ్యవస్థను ఆగం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సంఘాలతో చర్చించి అంగీకారానికి వచ్చిన అంశాలకు అనుగుణంగా నిబంధనలు రూపొందించి జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.