Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడి పుస్తకాలతో పాటు.. ఇతర సాహిత్యమూ చదవాలి
- జాతీయ స్థాయి బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు
నవతెలంగాణ-కొత్తగూడెం
చిన్నతనం నుంచే విద్యార్థులు సాహిత్యం పట్ల మక్కువ పెంచుకుంటే ఎంతో ఎత్తుకు ఎదుగుతారని, బడి పుస్తకాలతో పాటు ఇతర సాహితీవేత్తల సాహిత్య పుస్తకాలనూ చదవాల్సిన అవసరం ఉందని, ఓడి గెలిచినవారు చరిత్రలో ఎంతోమంది ఉన్నారని జాతీయ స్థాయి బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో రెండు రోజులపాటు నిర్వహించనున్న ''కథా, కవితా'' కార్యశాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుల ఒత్తిడి కారణంగా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. అంతరించిపోతున్న సాహిత్య విలువలు మీలో సాహితీ అంకురమై మొలకెత్తి కవులుగా ఎదగాలని ఆకాంక్షించారు. సమాజ మార్పుకు పాటు పడాలని కోరారు. రెండు రోజుల పాటు జరిగే కథా-కవితా కార్యశాలలో ఇష్టమైన సాహిత్యాన్ని ప్రఖ్యాత రచయితల ద్వారా తెలుసుకొని మెళకువలు తెలుసుకొని సాహితీ రంగంలో రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ బాబు అమృతోత్సవాల జన్మదినోత్సవం సందర్భంగా ఆయన్ను పలువురు మెమోంటోతో సత్కరించారు. 25 ఏండ్ల పాటు బాలోత్సవ్ కార్యక్రమాలు నిర్వహించి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసు కొచ్చారని, కొత్తగూడెం బాలోత్సవ్ స్ఫూర్తితో ఆంద్ర ప్రదేశ్‌లోనూ సుమారు 50 ప్రాంతాల్లో బాలోత్సవ్లు నిర్వహిస్తున్నారని, తెలంగాణలోకూడా జరుగుతున్న తీరును ఈ సందర్భంగా పలువులు వక్తలు గుర్తు చేశారు. కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితలు చందు, మండవ సుబ్బారావు, శీరంశెట్టి కాంతారావు, అనీల్ డ్యాని, మధు, తులసీ, కటుక్వొజల రమేష్, సాగర్, రవికుమార్, మహర్షి, పుప్పాల కృష్ణమూర్తి, నాగరాజ శేఖర్, సైదులు, భగవంతం, పిట్టల మల్సూర్, ప్రముఖ కవులు, సాహితీ వేత్తలు పాల్గొన్నారు.