Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా రైతు నాయకుల అరెస్ట్
- ఖండించిన నాయకులు
నవతెలంగాణ-మోపాల్
కాళేశ్వరంలో భాగంగా ప్యాకేజీ 21, 22 కింద నిర్మిస్తున్న మంచిప్ప రిజర్వాయర్ పనులు ఆపాలని భూ నిర్వాసితులు శుక్రవారం ఆందోళన చేపట్టగా.. పలువురు రైతు నాయకులను పోలీసులు అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. కాగా శనివారం ఉదయం కోర్టుకు హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించారు. అయితే భూ నిర్వాసిత కమిటీ గౌరవ అద్యక్షులు దేవా శంకర్‌తో పాటు గంగాధర్ యాదవ్‌ను మాత్రమే అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ మహేశ్ చెబుతుండగా.. 12 మందిని అరెస్ట్ చేశారని ముంపు బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా మంచిప్పతో పాటు పరిసర గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ధర్నా చేసిన వారి ఇంటిపైన అర్ధరాత్రి సమయంలో పోలీసులు దాడికి పాల్పడ్డారని, వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అరెస్ట్ చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని రాజకీయ పార్టీల నాయకులు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన పాత డిజైన్ ప్రకారమే పనులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కిసాన్ ఖేత్ జిల్లా అధ్యక్షులు ముప్పగంగారెడ్డి డిమాండ్ చేశారు. బాధితులను అరెస్టు చేయడం వారి కుటుంబాలని భయభ్రాంతులకు గురిచేయడం తీవ్ర బాధాకరమని, అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు. ముంపు బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలో రాగానే బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి, మోపాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బున్య రవి, వెంకట్ రామ్, సాంబయ్య, షేక్ గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.