Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తండాలో సంఘం కమిటీలు ఏర్పాటు చేయాలి : గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మనాయక్
నవతెలంగాణ-కొణిజర్ల
హక్కుల సాధన కోసం గిరిజనులంతా ఐక్యం కావాలని, ఖమ్మంలో ఐటీడీఏ ఏర్పాటు లక్ష్యంగా పోరాడాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూడవత్ ధర్మానాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య వీరభద్రం పిలుపునిచ్చారు. శనివారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లక్ష్మీపురంలో గిరిజన సంఘం తండా మహాసభలో వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులను కాలరాస్తూ పోడు భూములన్నింటిని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్ర చేస్తుందన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా అడ్డుపడుతుందని విమర్శించారు. కేంద్రం నిధులు గిరిజనుల అభివృ ద్ధికి ఖర్చు చేయకుండా పక్కదారి పట్టిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి జిల్లా కేంద్రాల్లో ఐటీడీఏ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయలేదని ఇప్పటికైనా దానిపై దృష్టిసారించాలని డిమాండ్ చేశారు.
ఫిబ్రవరి, మార్చిలో జరిగే గిరిజన సంఘం జిల్లా, రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సంఘం సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు. గిరిజనులందరూ సభ్యత్వం తీసుకొని సంఘం అభివృద్ధి కోసం సంఘటితం కావాలన్నారు. రైతులకు హక్కు పత్రాలు అందించాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని, గిరిజనుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు తేజావత్ కృష్ణ కాంత్, బానోత్ హరిచంద్, తదితరులు పాల్గొన్నారు.