Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్ధరాత్రి మహాపూజ
- హాజరైన కలెక్టర్, ఐటీడీఏ పీఓ
- గోవాడకు చేరుకున్న మెస్రం వంశీయులు
- పూజ అనంతరం కొత్త కోడళ్ల భేటింగ్
నవతెలంగాణ- ఇంద్రవెల్లి
రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని నాగోబా దేవత మహాపూజ పుష్యమాసం శనివారం అర్ధరాత్రి జరిగింది. ఈ పూజలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీఓ వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రేఖానాయక్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఐటీడీఏ సలహామండలి చైర్మెన్ కనక లక్కేరావు తదితరులు పాల్గొన్నారు. మర్రిచెట్టు వద్ద బస చేసిన మెస్రం వంశీయులు గోవాడకు చేరారు. పూజారి(ఖటోడ) మెస్రం కోసు, హన్మంతు, ధర్ము ప్రధాన్‌లు దాదేరావ్, తిరుపతి, పటేల్ వెంకట్రావ్ ఆధ్వర్యంలో గంగాజలంతో ఆలయ ప్రవేశం చేశారు. గంగాజలం ఝారిని ఆలయం వెనుక భద్రపరిచారు.
పుట్ట తయారీ..
నాగోబా పూజకు ఉపయోగించే కొత్త కుండలను వారి ఆచార సంప్రదాయం ప్రకారం మెస్రం వంశీయుల ఆడబిడ్డలకు పటేళ్ల ఆధ్వర్యంలో అందజేశారు. మెస్రం ఆడబిడ్డలు ముసుగు వరకు తెల్లటి వస్త్రం ధరించి వరుసలో వెళ్లి కోనేరు నుంచి తెచ్చిన నీటితో కొత్త పాము పుట్టను తయారు చేశారు. ఈ పుట్ట తయారీలో మెస్రం అల్లుళ్లకు పెద్దపీట ఉంటుంది. వీరు పాత పుట్టను తవ్వి మెత్తటి మట్టితో కొత్త పుట్టను తయారు చేశారు. మెస్రం ఆడపడుచులు నీటిని పోస్తూ పుట్ట తయారీకి సహకరించారు. ఇలా ఏడు దేవతల పేరిట ఏడు పుట్టలను తయారు చేశారు. వారి ఆచార సంప్రదాయం ప్రకారం మొక్కులు తీర్చుకున్నారు.
నాగోబాకు మహా జలాభిషేకం
కోనేరు నుంచి కొత్త కుండల్లో తెచ్చిన నీటితో ఆలయాన్ని శుద్ధి చేశారు. సంప్రదాయ వాయిద్యాలైన కాలికొమ్, పెప్రీ, డోలు వాయిస్తూ కాగడాలను వెలిగించి పూజను ఆరంభించారు. గోదావరి నది హస్తినమడుగు నుంచి తెచ్చిన గంగా జలంతో పూజారి కోసు నాగోబాకు జలాభిషేకం చేశారు. పూజ సమయంలో రాగి చెంబులో పాలు, నవధాన్యాలతో కూడిన నైవేద్యాన్ని ఉంచి దానిపై తెల్లటి వస్త్రంతో కప్పి ఉంచారు. ఈ వస్త్రం పైకి కదిలే వరకు వాయిద్యాలను వాయిస్తూనే ఉంటారు. ఈ పూజ వేళలో ఆలయంలో మెస్రం వంశీయులకు మాత్రమే అనుమతి ఉంది. రాగి చెంబుపై ఉంచిన వస్త్రం కదిలే వరకు పూజ చేశారు. వస్త్రం పైకి కదిలినప్పుడు నాగ దేవత పాలు తాగినట్టు వారి నమ్మకం. ఈ పూజ అర్ధరాత్రి వరకు కొనసాగింది. అప్పట్నుంచి నాగోబా జాతర అధికారికంగా ఆరంభమైనట్టు భావిస్తారు. ఈ జాతర ఎనిమిది రోజుల వరకు కొనసాగుతుంది.
కొత్త కోడళ్ల భేటింగ్(పరిచయం)
నాగోబా మహాపూజ అనంతరం కొత్త కోడళ్ల భేటింగ్(పరిచయం) నిర్వహించారు. మెస్రం వంశీయుల్లో పెండ్లి అయిన ప్రతి కోడలూ ఈ నాగోబా సన్నిధిలో తమ కుల పెద్దల సమక్షంలో భేటింగ్ నిర్వహించడం ఆచారం. ఇక్కడ భేటింగ్ అయిన తర్వాతనే నాగోబా దర్శనానికి అనుమతి ఉంటుంది. అంతవరకు వీరికి ఆలయ ప్రవేశం, దర్శనం నిషిద్ధం.