Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్షులుగా జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 3వ మహాసభ 2023 మార్చి 1,2,3 తేదీల్లో మిర్యాలగూడలో నిర్వహించనుండగా.. దానికి ఆహ్వాన సంఘం కమిటీని ఎన్నుకున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఐక్య ఉపాధ్యాయ భవన్లో శనివారం ధిరావత్ రవినాయక్ అధ్యక్షతన ఆహ్వాన సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. గిరిజన హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న గిరిజన సంఘం రాష్ట్ర 3వ మహాసభ మిర్యాలగూడలో జరపడం శుభపరిణామమన్నారు. మహాసభ జయప్రదానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గిరిజన హక్కులను కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం గురించి కాకుండా మతం, కులం అంటూ ప్రజల మధ్య ఘర్షణలు పెడుతుందని విమర్శించారు. గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాంనాయక్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని జరిగిన పోరాటాల్లో గిరిజన సంఘం అగ్రభాగాన నిలిచిందన్నారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలం సాగిన గిరిజన రిజర్వేషన్ సాధన ఉద్యమంలో గిరిజన సంఘం రాజీ లేకుండా పోరాడిందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలని, పోడు భూములకు హక్కులు కల్పించాలని ఉద్యమాలు నిర్వహించిందని గుర్తు చేశారు. ఈ మహాసభలో 500 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. మార్చి 1న నిర్వహించే మహాప్రదర్శన, బహిరంగ సభలో పెద్దఎత్తున గిరిజనులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం ఆహ్వాన కమిటీని ఎన్నుకున్నారు.
- చీఫ్ ప్యాట్రన్స్ ట్రకార్ చైర్మెన్ ఇస్లావత్ రామచందర్ నాయక్, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఆర్.శ్రీరాం నాయక్, కోశాధికారిగా ఎం.రవి నాయక్, చీఫ్ కోఆర్డినేటర్‌గా ధిరావత్ రవి నాయక్, అతిథులుగా ముడావత్ ధర్మ నాయక్‌ను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ ధర్మనాయక్, నాయ కులు భూక్య వీరభద్రం, కొర్రా శంకర్, ఎం.రవి నాయక్, అంగోత్ వెంకన్న, పాప, దేశిరం, వినోద్, బాబు, నరేష్, సైదా, జగన్ తదితరులు పాల్గొన్నారు.