Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-అంబర్ పేట
మహిళా న్యాయవాదులను, అధికారులను ఇబ్బందులకు గురి చేస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అఖిల భారత యాదవ మహాసభ న్యాయ విభాగం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యాదవ మహిళా న్యాయవాదులు, అధికారుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసిఆర్ యాదవ విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కోకాపెటలో రూ.300 కోట్ల విలువైన స్థలాన్ని కేటాయించి.. భవన నిర్మాణానికి రూ.5 కోట్లు ఇచ్చారని, అవసరమైతే రూ.8-9 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. యాదవ మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. దేశంలో యాదవులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి మాట్లాడుతూ.. అవకాశాలు రావడం లేదనే నిరాశ, నిస్పృహలు విడనాడి కష్టపడటం ద్వారా సుఖ పడతారనే సత్యాన్ని గుర్తించి ముందుకు సాగాలని సూచించారు. తాము ''బ్యాక్ వర్డ్ కాదు.. బ్యాక్ బోన్'' అనే విషయాన్ని గ్రహించాలన్నారు. అఖిల భారత యాదవ మహాసభ న్యాయ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు చలకాని వెంకట్యాదవ్ మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థ నియామకాల్లో యాదవ మహిళా న్యాయవాదులకు సముచితస్థానం కల్పించాలని కోరారు. న్యాయవాదులకు స్పెషల్ గ్రాంట్ ఏర్పాటు చేసి, డెత్ బెన్ఫిట్, రిటైర్మెంట్ బెన్ఫిట్గా మార్చి రూ.25 లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే నోముల భగత్ యాదవ్, ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, సమాచార హక్కు చట్టం మాజీ ప్రధాన కమిషనర్ డాక్టర్ వర్రే వెంకటేశ్వర్లు తదితరులు ప్రసంగించారు. న్యాయవాది అచ్యుత యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాగాయని విమలక్క, రాష్ట్రపతి భవన్ బొల్లారం ఎస్టేట్ ఆఫీసర్ రజినీ ప్రియయాదవ్, అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ మహేశ్వరీ యాదవ్, ఓయూ లా కాలేజీ ప్రిన్సిపల్ రాధిక యాదవ్, డాక్టర్ శిరీష యాదవ్, డాక్టర్ రమాయాదవ్, అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మణ్ యాదవ్, మహిళా అధ్యక్షులు రాగం సుజాత యాదవ్, కార్పొరేటర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. న్యాయవాదులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్ కార్డులు ఇవ్వాలని, దాన్ని కుటుంబ సభ్యులందరికీ వర్తింపజేయాలని తీర్మానించారు. జూనియర్ న్యాయవాదులకు ఐదు సంవత్సరాలపాటు నెలకు పదివేల గౌరవ వేతనం అందించాలని, 41ఏ సి.ఆర్.పి కింద స్టేషన్ బెయిల్ ఇచ్చే పద్ధతిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం కొలీజియం నియామకాల్లో అసమా నతలు రూపుమాపే వైఖరి తీసుకోవాలని, న్యాయ వ్యవస్థ నియామకాల్లో రిజర్వేషన్స్ అమలు చేయాలని, పశుసంవర్ధక శాఖ ఉద్యోగాల్లో యాదవులకు ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలని తదితర తీర్మానాలు చేశారు.