Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఐక్య పోరాటాల ద్వారానే ఇండ్ల స్థలాల సాధన సాధ్యమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిలో ఇండ్ల స్థలాల కోసం గుడిసెలు వేసిన గుడిసె వాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో తమ్మినేని పాల్గొని మాట్లాడారు. ముందుగా పస్రా బస్టాండ్ సెంటర్ నుండి గుడిసెలు వేసిన ప్రాంతం వరకు తమ్మినేని గుడిసె వాసులతో కలిసి పాదయాత్ర చేశారు. దారి పొడవున ఎర్రటి తోరణాలతో పస్రా చౌరస్తా ఎరుపెక్కి పోవడంతో పాటు ర్యాలీలో పాల్గొన్న ప్రజలు చేస్తున్న నినాదాలతో మార్మోగిపోయింది. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ.. ఎన్ని అవాంతరాలు వచ్చినా, నిర్బంధాలు ఎదరైనా.. కేసులు నమోదైనా.. వెరవకుండా, బెదరకుండా ఐక్యంగా పోరాడాలని సూచించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు, పక్కా గృహాలు ఇప్పించిన చరిత్ర సీపీఐ(ఎం)కి మాత్రమే ఉందని అన్నారు. గుడిసెలు పీకినా, కాలబెట్టినా మళ్ళీ గుడిసెలు వేద్దామని, అరెస్టులు, కేసులకు భయపడేది లేదని, పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కులమతాలు, పార్టీలు, జెండాలు ప్రధానం కాకుండా పోరాటం ముందుకు సాగాలని సూచించారు. ప్రస్తుతం ఎన్నికల వాతావరణం కొనసాగుతున్నందున సాధ్యమైనంత త్వరలోనే ఫలితం వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.అనంతరం గుడిసేవాసులు తమ్మినేని వీర భద్రంకు లెనిన్ చిత్రపటాన్ని కానుకగా అందించారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, బండారి రవికుమార్, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి, జిల్లా నాయకులు ఎండీ అంజద్ పాష, ప్రవీణ్ కుమార్, ఎండీ దావూద్, దొబగట్ల లక్ష్మయ్య, బి రెడ్డి సాంబశివ, మండల కార్యదర్శి తీగల ఆదిరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు అంతటి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.