Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిజ్ భూషణ్ శరణ్‌ను పదవి నుంచి తొలగించాలి
- ఐద్వా డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారత మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడయిన బ్రిడ్జ్ భూషణ్ శరణ్‌ను వెంటనే బాధ్యతల నుంచి తొలగించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు.
రెజ్లర్లకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఐద్వా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమకు న్యాయం చేయాలని బ్రిడ్జ్ భూషణ్‌ను సమాఖ్య అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించాలని భారత మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనతో భారత ఒలంపిక్ సంఘం దిగొచ్చి ఏడుగురితో విచారణ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. దీన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కమిటీ నిష్పక్షపాత విచారణ జరపాలంటే.. సమాఖ్యకు అధ్యక్ష పదవి నుంచి భూషణ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే కమిటీని ప్రభావితం చేయగలిగే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు. విచారణ కమిటీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలనీ, క్రీడాకారులకు రక్షణ కల్పించాలనీ, విచారణకు సహకరించిన వారి వివరాలను గోప్యంగా ఉంచి, వారి క్రీడా భవిష్యత్తును, గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.