Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు పిల్లల వేడుకోలు
- పాఠశాల విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- పోలీసుల అమానుషం
- చిన్నారులు, టీచర్లను అరెస్టు చేసిన ఖాకీలు
- 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు చేపట్టాల్సిందే
- న్యాయం జరిగే వరకూ పోరాటం
- ఉపాధ్యాయ దంపతుల మౌన దీక్ష
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భార్యా భర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ దంపతులు చేపట్టిన పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం ముట్టడి రణరంగంగా మారింది. అక్కడికి వచ్చిన ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో వచ్చిన ఉపాధ్యాయ దంపతులు, పిల్లలతో సహా రోడ్డుపై బైఠా యించి నిరసన చేపట్టారు. స్పౌజ్ బదిలీలు చేపట్టాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు లు, ఉపాధ్యాయులకు మధ్య తోపులాట జరిగింది. చిన్నపిల్లలు, మహిళా టీచర్లపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. తల్లుల ఒళ్లో కూర్చున్న పిల్లలను గుంజి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు. దీంతో పిల్లలు విలపించారు. కొందరు టీచర్లపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి చేయిచేసుకున్నారు. కొందరు పిల్లలు, ఉపాధ్యాయులకు స్వల్ప గాయాల య్యాయి. దొరికిన వారిని దొరికినట్టుగానే అరెస్టు చేసి హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. సైఫాబాద్‌లో ఉన్న పాఠశాల విద్యా శాఖ సంచాలకుల కార్యాలయం ముందు శనివారం ఉపాధ్యాయ దంప తులు మౌన దీక్ష చేపట్టారు. 'సీఎం కేసీఆర్ తాత... మా అమ్మానానన్నను ఒకే జిల్లాకు పంపండి.'అంటూ చిన్న పిల్లలు ఫ్లకార్డులను ప్రదర్శించారు. 19 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలకు అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం మరో 13 జిల్లాల్లో నిషేధం విధించడం అన్యాయమంటూ పలువురు ఉపాధ్యాయ దంపతులు ప్రశ్నించారు. వేర్వేరు జిల్లాల్లో విధులు నిర్వహించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 317 ద్వారా ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ తక్షణమే జోక్యం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించాలనీ, లేదంటే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
615 మంది చేయాలనుకోవడం సరికాదు : వివేక్
13 జిల్లాల్లో 2,100 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకుంటే 615 మంది స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే బదిలీలకు అవకాశం కల్పించడం సరైంది కాదని స్పౌజ్ టీచర్ల ఫోరం అధ్యక్షులు వివేక్ విమర్శిం చారు. దీంతో ఎస్జీటీలు, పండితులు, పీఈటీ ఉపాధ్యాయ దంపతులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని స్కూల్ అసిస్టెంట్లకు అవకాశం కల్పించడం ఎంత వరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓట్ల కోసమే తప్ప ఉపాధ్యా యులు, పిల్లలు, వారి తల్లిదండ్రుల ఇబ్బందులు ఈ ప్రభుత్వానికి పట్టవా? అని అడిగారు. అన్ని జిల్లాల్లోనూ స్పౌజ్ బదిలీలు చేపట్టే అవకాశమున్నా ప్రభుత్వం అనుమతించడం లేదన్నారు. 317 జీవో ద్వారా భార్యాభర్తలను విడదీసిన ఘనత ప్రభుత్వానిదేనని విమర్శించారు. తమ పిల్లలనీ, తమని కన్న తల్లిదండ్రులను చూసుకోలేక సతమతమవుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. 13 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతులందరికీ బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్పౌజ్ టీచర్ల ఫోరం ప్రధాన కార్యదర్శి ఖాదర్, కోఆర్డినేటర్లు నరేష్, కృష్ణ, ఉపాధ్యక్షులు త్రివేణి, కోశాధికారి శిరీష, నాయకులు మమత, శోభ, సుజాత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సంఘాల ఖండన
నిషేధం విధించిన 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు చేపట్టాలంటూ పాఠశాల విద్యాశాఖ కార్యాలయం వద్ద మౌనదీక్ష చేపట్టిన ఉపాధ్యాయ దంపతుల అరెస్టును ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి. పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం సరైంది కాదని తెలిపాయి. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి , ఎస్టీయూటీఎస్ అధ్యక్షులు జి సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి బి భుజంగరావు, టీపీటీఎఫ్ అధ్యక్షులు వై అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్, తపస్ రాష్ట్ర అధ్యక్షులు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. బ్లాక్ చేసిన 13 జిల్లాల భార్యాభర్తల బదిలీలపై సాధారణ బదిలీలకు ముందే సానుకూల నిర్ణయం తీసుకోవా లని డిమాండ్ చేశారు. బాధిత ఉపాధ్యాయుల్లో నెలకొన్న ఆందోళనను నివారించాలని కోరారు.