Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వచ్చే నెల మూడు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అందుకు సంబంధించిన షెడ్యూల్ ఫిబ్రవరి రెండొ తేదీన ఖరారు కానుంది. ఆనెల నాలుగున బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉందని తెలిసింది. ఈమేరకు శనివారం అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి నరసింహాచార్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ, మండలి సమావేశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు. రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతోపాటు ఆ శాఖ అధికారులు హాజరయ్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇది ఎన్నికల ఏడాది కావడంతో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి బడ్జెట్ రూపొందించాలని సర్కారు నిర్ణయించింది. అయితే గతేడాది బడ్జెట్ సమావేశాలను మార్చి ఏడో తేదీ నుంచి నిర్వహించగా ఈసారి నెల ముందే జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎన్ని రోజులు నిర్వహించాలన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ఫిబ్రవరి ఒకటిన కేంద్రం కూడా 2023-24 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. దాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సర్కారు భావిస్తున్నది. 2022-23 సంవత్సరానికి రూ.2,56,958 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2023-24 బడ్జెట్ ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్టు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని శాఖలు ఈ నెల 13వ తేదీలోపు తమకు ప్రతిపాదనలు పంపాలనీ, అయితే 12వ తేదీలోపే ముఖ్య కార్యదర్శులకు చేరాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలతోపాటు 2022-23 బడ్జెట్లో దళితబంధు కోసం కేటాయించిన నిధులను వినియోగించకపోవడం, ఆ పథకం రెండో విడత ప్రారంభం కాకపోవడం, గిరిజన బంధు కూడా ఇస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించడంతో వీటిపై అసెంబ్లీలో ఆయన ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రస్తుత ఏడాదిలో అంచనా వేసిన మేరకు కేంద్ర గ్రాంట్లు, అప్పులు అందడంలేదు. ఈ అంశాన్ని దష్టిలో ఉంచుకునే బడ్జెట్ రూపకల్పన ఉంటుందని అధికారిక వర్గాలు అంటున్నాయి.