Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 300 మంది చిన్నారులు ఉన్నా సెంటర్ లేక అవస్థలు
- ఐదేండ్ల వరకు ఇంటి దగ్గరే పిల్లలు
- గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం కరువు
- సెంటర్ కావాలంటే 4కిలోమీటర్లు వెళ్లాల్సిందే..
- మియపూర్ నడిగడ్డతాండాలో చిన్నారులు, గర్భిణులు, బాలింతల దీనగాథలు
అది అటవీ ప్రాంతమో కాదు.. అదివాసీ గూడెమో అంతకన్నా కాదు.. రవాణా సౌకర్యం కష్టమేమీ లేదు.. సమాజానికి దూరంగానేమీ విసిరి వేయబడలేదు.. అక్కడ జనం లేక ఆ ప్రాంతమేమీ మోడుబారలేదు. నగరం నడిబొడ్డున ఉన్న మియపూర్ పరిధిలోని నడిగడ్డతాండా ప్రాంతం. ఆ ప్రాంతంలో కనీసం 'అంగన్వాడీ' సెంటర్ లేదు. 30 మంది చిన్నారులకు ఒక అంగన్వాడీ ఉండాలని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నా.. అక్కడ 300 మంది చిన్నారులున్నా ఒక్కటంటే ఒక్క అంగన్వాడీ సెంటర్ లేకపోవడంతో చిన్నారుల బాల్యం గడితప్పుతోంది. గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందని ద్రాక్షే అవుతోంది. అసలు అంగన్వాడీ సెంటర్ల ద్వారా ఆహారం అందిస్తారన్న విషయమే వీరికి తెలీదు. స్త్రీ-శిశు సంక్షేమ శాఖ వీరిని పట్టించుకున్న పాపానపోలేదు. అంగన్వాడీ సెంటర్లు లేక బాల్యాన్ని కోల్పోతున్న పిల్లల దీనగాథలపై కథనం.
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా మియపూర్ పరిధిలోని నడిగడ్డ తాండాలో సుమారు 800 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇక్కడ ఐదేండ్ల లోపు ఉన్న చిన్నారులు సుమారు 300 మంది ఉన్నారు. వీరితో పాటు బాలింతలు, గర్భిణులు సుమారు వంద మంది వరకు ఉన్నారు. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలంతా కూలీ, నాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పొద్దున లేచి కూలీ పనులకు వెళ్లాల్సిందే.. లేదంటే రాత్రికి ఇంటిలో పొయ్యి వెలిగే పరిస్థితి ఉండదు. ఇలాంటి దీనస్థితిలో బతుకిడ్చుతున్న ప్రజల పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ నిబంధనాల మేరకు ప్రతి 30 మంది చిన్నారులకు ఒక అంగన్వాడీ సెంటర్ నడపాలని ఉన్నప్పటికీ.. ఇక్కడి పిల్లలు ఐదేండ్లు వచ్చే వరకు బడికి వెళ్లే పరిస్థితి లేదు. అంగన్వాడీ సెంటర్ లేకపోవడంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు పౌష్టికాహరం లోపంతో అనారోగ్యం బారిన పడి అల్లాడుతున్నారు. గర్భిణులు రక్తహీనతతో బాధ పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే బలవర్థకమైన ఆహారం అందించాల్సి ఉంది. అయితే వీరు అంగన్వాడీ సెంటర్లకు వెళ్లాలంటే సుమారు నాలుగు కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. గర్భిణుల, బాలింతలు అంత దూరం వెళ్లాలేని పరిస్థితి. దాంతో 50 శాతం మంది బాలింతలు పౌష్టికాహర లోపంతో బాధపడుతున్నారు. పుట్టిన పిల్లలు కూడా బలహీనంగా ఉంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ సెంటర్ కోసం ఎన్ని సార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు వినతులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ప్రాంతంలో అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
అంగన్వాడీకి పోయిందే లేదు..
అంగన్వాడీ సెంటర్లో బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహరం పెడుతారన్న విషయం కూడా మాకు ఎవరు చెప్పలేదు. మా చుట్టు పక్కన ఎక్కడా అంగన్వాడీ సెంటర్ లేదు. ఇక్కడి పిల్లలంతా ఐదేండ్ల వరకు ఇంటి దగ్గరే ఉంటారు. అంగన్వాడీ సెంటర్ ఉంటే పిల్లలకు రక్షణ ఉంటుంది. ప్రభుత్వం మా కాలనీలో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
- కవిత, నడిగడ్డతాండ
పిల్లలు రోడ్ల మీద తిరుగుతుండ్రు..
అంగన్వాడీ సెంటర్ లేకపోవడంతో పిల్లలు రోడ్ల మీద తిరుగుతుండ్రు. మేము పొద్దునే పనికి పోతే వారి ఆలనా పాలనా చూసే దిక్కులేదు. వారి బాగోగులు చూసుకుంటా ఇంటి కాడ ఉంటే పూట గడవదు. మా గోస ఎవరికీ పట్టడం లేదు. అధికారులు ఇప్పటికైనా మా పిల్లల కోసం అంగన్వాడీ సెంటర్ను ఏర్పాటు చేయాలి.
- జ్యోతి, నడిగడ్డ తాండ