Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల మద్దతుతో సామ్రాజ్యవాదంపై పోరాడతాం
- ఆర్థిక దిగ్బంధనంతో ఇబ్బందులు
- న్యూజిలాండ్ నుంచి పాలు తెచ్చుకోవాల్సిన దుస్థితి :చే గువేరా కూతురు అలైదా గువేరా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అమెరికా సామ్రాజ్యవాదం విధిస్తున్న క్రూరమైన, అమానవీయ ఆంక్షలను అంతమొందిస్తామని చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా చెప్పారు. దీనికి అంతర్జాతీయంగా అన్ని దేశాల సంఘీభావం క్యూబా ప్రజలకు ఎంతో అవసరమని అన్నారు. ప్రజల మద్దతుతో సామ్రాజ్యవాదంపై ఐక్యంగా పోరాడతామన్నారు. నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా (ఎన్సీఎస్సీ), అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఐప్సో) సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో 'క్యూబా సంఘీభావ సభ'ను నిర్వహించారు. ఈ సభకు విశేష స్పందన లభించింది. భారీగా జనం తరలొచ్చారు. కుర్చీలు నిండిపోవడంతోపాటు జనం రవీంద్రభారతి హాల్లో జనం నిలబడి ఉండడంతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. 'అప్ అప్ సోషలిజం... డౌన్ డౌన్ కాపిటలిజం. విప్లవ వేగుచుక్క చేగువేరా'అంటూ పెద్దఎత్తున జనం నినాదాలు చేశారు. ముఖ్యఅతిధిగా హాజరైన అలైదా గువేరా మాట్లాడుతూ తాను తెల్లగా ఉన్నా తనలో నల్లజాతి వారి భావాలున్నాయని అన్నారు. చేగువేరా కూతురి కన్నా క్యూబా పౌరురాలిగా ఉండడం గర్వకారణమని చెప్పారు. ఆయన చూపిన మార్గంలో నడవాలనీ, ఆదర్శాలను ప్రేమించాలని సూచించారు. ఆయన పరిపూర్ణ కమ్యూనిస్టు అని వివరించారు. ఏది ఆలోచిస్తే అదే చెప్పి చేస్తారని అన్నారు. అందువల్లే మంచి నాయకుడయ్యారని చెప్పారు. అందరూ జీతం కోసం పనిచేస్తారనీ, ప్రజల కోసం స్వచ్చంధ సేవ డబ్బు రాకున్నా ఏమీ ఆశించకుండా పనిచేయాలని వివరించారు. ఈ సేవ ద్వారా అనేక అనుభవాలొస్తాయనీ, ప్రజల సమస్యలు తెలుసుకోవచ్చనీ, ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చని చెప్పారు. తద్వారా గొప్ప మనుషులుగా తీర్చిదిద్దబడతామని వివరించారు. ఏ హోదా, ఏ రంగు, ఏ మతంలో ఉన్నామన్నది ముఖ్యం కాదనీ, మనుషుల్లా అందరితో గౌరవంగా ఉండాలని సూచించారు.
క్యూబా అంటే అమెరికాకు భయం...
చిన్న దేశం క్యూబా అమెరికా సామ్రాజ్యవాదంపై పోరాడుతున్నదని అలైదా గువేరా అన్నారు. తమ దేశంలోని ప్రజలు సామ్యవాద సమాజాన్ని నిర్మించేందుకు ముందుకెళ్తున్నారని చెప్పారు. క్యూబా ప్రజల వద్ద ఉన్న శక్తిని ఎవరూ తుడిచేయలేరని ధీమా వ్యక్తం చేశారు. పెట్టుబడిదారీ సమాజం కాకుండా ఇతర పద్ధతుల్లో బతకొచ్చనే విషయాన్ని క్యూబా ప్రపంచ దేశాలకు నేర్పిందన్నారు. అందుకే తమ దేశమంటే అమెరికా సామ్రాజ్యవాదానికి భయమని చెప్పారు. క్యూబాలో సహజ సంపదకు ప్రజలే యజమానులని వివరించారు. కానీ అమెరికా మాత్రం ప్రపంచంలో ఉన్న వనరులను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. క్యూబా తరహాలో ఇతర దేశాలు అనుసరిస్తే ఎలా అనే భయం అమెరికాకు పట్టుకుందన్నారు. అందుకే ఆర్థిక దిగ్బంధనం కలిగిస్తున్నదని చెప్పారు. తమ దేశంలో పాలు ఉత్పత్తి చేసే అవకాశం లేదన్నారు. కానీ పిల్లలు, వృద్ధులకు పాలు ఇవ్వడానికి వేరే దేశాల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇతర దేశాలతో వాణిజ్యం చేయకుండా అమెరికా ఆంక్షలు విధించిందన్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాలు కొనేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. ఓడలు అద్దెకు తీసుకుని న్యూజిలాండ్ వెళ్లే క్రమంలో ఆ యజమానులపై ఆంక్షలు విధిస్తున్నదని అన్నారు. దీంతో పాలను ఎక్కువ ధరలకు కొనాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా అందరి ఆకలి తీర్చేందుకు క్యూబా తిండిని సమకూర్చుతున్నదని వివరించారు. అమెరికాపై పోరాడుతూ ఇంతకాలం దృఢంగా ఉన్నామనీ, భవిష్యత్తులోనూ ప్రపంచ దేశాల సహకారం, సంఘీభావంతో ముందుకెళ్తామని చెప్పారు. సమాజంలో మార్పు రావాలంటే విద్యతోనే సాధ్యమని అన్నారు. ఫైడల్ కాస్ట్రో మొదటినుంచి విద్యకు ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. దీనివల్ల మహిళా సాధికారత వచ్చిందన్నారు. వారు పనిచేయడంతోపాటు నిర్ణయాధికారంలో ఉన్నారని వివరించారు. ఇండియా కంటే ఒక విషయంలో తాము వెనకాల వెళ్తున్నామని చెప్పారు. ఇక్కడ మహిళ ప్రధాని అయ్యారనీ, క్యూబాలో ఇంకా చూడలేదని అన్నారు. ఎంత శక్తివంతమైన రాజ్యమైనా ఇతర దేశాలను నియంత్రించలేదని చెప్పారు. ప్రపంచంలో అన్ని దేశాల సంఘీభావం క్యూబాకు అవసరమన్నారు. 'పోరాటాన్ని ముందుకుతీసుకెళ్లాలి. విజయం మన సొంతమయ్యేంత వరకు సామ్రాజ్యవాదంపై పోరాడాలి'అంటూ క్యూబా ప్రజలతో సెలవు తీసుకునేముందు చేగువేరా అన్నారని ఆమె గుర్తు చేశారు.
క్యూబాకు అండగా నిలబడాలి : తమ్మినేని
అమెరికా సామ్రాజ్యవాదం క్యూబాపై విధిస్తున్న ఆంక్షలు, నిర్బంధాలను ఖండిస్తున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. క్యూబాకు భారత ప్రజలు అండగా నిలబడాలని కోరారు. అమెరికాకు ఇష్టంలేని పాలన అక్కడ కొనసాగుతున్నదని అన్నారు. అందుకే ఆంక్షలు విధించిందన్నారు. దానివల్ల క్యూబాకు రూ.13 లక్షల కోట్ల నష్టం వచ్చిందని వివరించారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఎర్రజెండాను, సోషలిస్టు పంథాను క్యూబా వీడలేదని చెప్పారు. చేగువేరా ఏ దేశానికి చెందిన వ్యక్తి కాదనీ, ఆయన ప్రపంచ మానవుడని అన్నారు. ఎక్కడ విప్లవం ప్రారంభమైనా అక్కడికి వెళ్లి పోరాటం చేశారని గుర్తు చేశారు. అమెరికా సామ్రాజ్యవాదం కుప్పకూలే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. డాలర్ ఆధిపత్యం పోవాలంటూ కొన్ని దేశాలు ఆలోచిస్తున్నాయని చెప్పారు. దోపిడీ, ప్రజలను అణచివేసే ఏ ప్రభుత్వమైనా పతనమవుతుందని హెచ్చరించారు.
ప్రపంచ దేశాలకు ఆశాదీపం క్యూబా :కె నాగేశ్వర్
అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్యూబా ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు గురయ్యే దేశాలకు ఆశాదీపమని ప్రముఖ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ అన్నారు. అన్ని రకాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే ఆ దేశానికి నిజమైన సంఘీభావమని చెప్పారు. భారత్‌లో సమానత్వంతో కూడిన కొత్త సమాజం కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.