Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా
- కేసీఆర్‌కు గాలి జనార్దన్ రెడ్డికి పట్టిన గతే పడుతుంది
- మాదిగలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అన్యాయం : పీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరం ఖాయమని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన టీఆర్ఎస్ నాయకులు నియంతలుగా మారిపోయారని పీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా బిజెనేపల్లి మండల కేంద్రంలో దళిత గిరిజన ఆత్మగౌరవ బహిరంగ సభ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అత్యంత కీలకమైన వ్యక్తుల్లో నాగం ఒకరని, ఆయనతో పెట్టుకున్న గాలి జనార్ధన్ రెడ్డి కటకటాల పాలైన విషయం గుర్తు చేశారు. దొరలకు కేంద్ర బిందువుగా టీఆర్ఎస్ ఉంటే, పెట్టుబడిదారులకు బీజేపీ సింబల్‌గా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం దళిత, గిరిజనులకు చేయూత ఇచ్చే పార్టీ అని గుర్తు చేశారు. ఇచ్చిన వాగ్దానాలు మరిచి సామాజికంగా అత్యంత వెనుకబడిన వారిపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. కనీసం మంత్రిమండలిలో దళితులకు చోటు కల్పించకపోవడం కేసీఆర్ నియంతృత్వ విధానాలకు నిదర్శనమని తెలిపారు.
టీఆర్ఎస్ విధానాలు నచ్చక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఐఏఎస్ మురళి, ప్రవీణ్‌చంద్ర లాంటి వారు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రాజెక్టులు కట్టిన చరిత్ర కాంగ్రెస్‌కి దక్కుతుందని, కాదని నిరూపిస్తే ఏ ప్రాజెక్టు దగ్గరికైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. 1200 మంది దళిత, బహుజనుల ఆత్మ బలిదానాలతో వచ్చిన తెలంగాణ పునాదుల మీద కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నాడని ఆరోపించారు.
రాష్ట్రం రాగానే దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, బీమాతోపాటు కల్వకుర్తి, పూతల పథకాలను ప్రారంభించి పూర్తిచేసిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ ఠాక్రే, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, చిన్నారెడ్డి, మాజీ ఎంపీ మల్లురవి, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శులు సంపత్ కుమార్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నాయకులు ఉబేదుల్లా కోత్వాల్, షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.