Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అతడి మాటలు.. చేతలు స్ఫూర్తిని రగిలించాలి...
- అదే మా నాన్న నుంచి తీసుకోవాల్సిన సందేశం
- ఆయన నిజాన్ని మాత్రమే నమ్మేవారు
- ఆ నిజమే కమ్యూనిజం
- మీడియాతో ఇష్టాగోష్టిలో చే గువేరా కుమార్తె డాక్టర్ అలైదా గువేరా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'నాయకుడంటే ఎదుటి వారికి ఉదాహరణగా నిలవాలి.. తన మాటలు.. చేతలు.. చర్యలు.. పోరాటాల ద్వారా తోటి వారిలో స్ఫూర్తిని రగిలించాలి...' అని క్యూబా విప్లవ యోధుడు చే గువేరా కుమార్తె డాక్టర్ అలైదా గువేరా వ్యాఖ్యానించారు. ప్రతీ విప్లవకారుడు తన తండ్రి జీవితం నుంచి తీసుకోవాల్సిన సందేశమిదేనని ఆమె తెలిపారు. తన తండ్రి ఒక పూర్తి స్థాయి కమ్యూనిస్టు అని చెప్పారు. ఆయన ఆసాంతం నిజాన్ని మాత్రమే నమ్మేవారని... ఆ నిజం పేరే కమ్యూనిజమని తెలిపారు. ప్రస్తుతం తన కుమార్తె ప్రొఫెసర్ ఎస్తేఫానియా గువేరా(చే గువేరా మనవరాలు)తో కలిసి భారతదేశంలో పర్యటిస్తున్న ఆమె.. క్యూబా సంఘీభావ సభలో పాల్గొనే నిమిత్తం ఆదివారం హైదరాబాద్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా సామ్రాజ్యవాదం ఉక్కుపాదం కింద నలిగిన ఒకప్పటి క్యూబాలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, నేటి విప్లవ క్యూబా సమాజంలోని స్థితిగతులు, విద్య, వైద్య రంగాల్లో అది సాధించిన పురోగతి, ప్రపంచ దేశాలకు వైద్య సేవలందించటం, అక్కడి మహిళా సమానత్వం తదితరాంశాలను ఆమె సోదాహరణంగా వివరించారు. తండ్రి చే గువేరాతో తాను కొద్ది కాలం గడిపిన జీవితం..తండ్రి తరవాత తండ్రిలాంటి క్యూబా మాజీ అధ్యక్షుడు ఫైడల్ కాస్ట్రోతో తనకున్న అనుంబంధం గురించి భావోద్వేగపూరితంగా చెప్పుకొచ్చారు. ఇష్టాగోష్టి సందర్భంగా పాత్రికేయులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అందులోని ముఖ్యాంశాలు...
- కరోనా కంటే ముందు.. ఆ తర్వాత కూడా వైద్య సేవల్లో క్యూబా అగ్రగామిగా నిలిచింది. పెద్ద పెద్ద దేశాలకు సైతం సాధ్యం కాని రీతిలో చిన్నా పెద్దా దేశాలకు డాక్టర్లు, సిబ్బందిని పంపింది. అసలు మీ వైద్యుల ప్రత్యేకత ఏమిటి..?
ఏ దేశానికి వైద్య సేవలు అవసరమైతే అక్కడికి మా డాక్టర్లు, సిబ్బందిని మేం పంపుతుంటాం. అయితే డబ్బులతో నిమిత్తం లేకుండా ఆ రకమైన సేవలను అందిస్తుంటాం. ఉదాహరణకు ఖతార్ మా సేవలకు డబ్బు చెల్లిస్తుంది. కానీ హైతీ చెల్లించలేదు. అందువల్ల ఖతార్‌లో వచ్చిన డబ్బు తీసుకుని హైతీకి సేవలందిస్తున్నాం. వర్ణ వివక్ష ఎక్కువగా ఉన్న దేశాల్లో సైతం క్యూబన్ డాక్టర్ల వద్దకు రోగులు ఎక్కువగా వస్తుంటారు. ఎందుకంటే.. వారు రోగుల పట్లగానీ, ప్రజల పట్ల గానీ ఎలాంటి వివక్షనూ చూపరు కాబట్టి. అందువల్ల ఆయా దేశాల్లో స్థానికులు క్యూబన్ డాక్టర్ల దగ్గర వైద్యం చేయించుకోవటాన్ని సౌకర్యంగా భావిస్తుంటారు.
- భారత్‌తోపాటు అనేక దేశాల్లో చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దోళ్ల వరకూ తరచూ పలు రకాల అంటువ్యాధులకు గురవుతుంటారు. వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్న క్యూబాలోని పరిస్థితిని ఒక డాక్టర్‌గా మీరెలా విశ్లేషిస్తారు..?
మేం ఎప్పుడూ రోగం వచ్చిన తర్వాత మందు తీసుకోవటం కంటే అసలు ఆ రోగం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంటాం. మా దేశంలో ఏడాది నుంచి 14 ఏండ్ల వయస్సున్న పిల్లలందరికీ మొత్తం 14 రకాల వ్యాక్సిన్లు (ప్రివెంటివ్ వ్యాక్సిన్లు) వేస్తాం. అందువల్ల మా దగ్గర ఎవరైనా పేదోళ్లుగా పుట్టినప్పటికీ... డబ్బున్న వారిలా (ఆరోగ్యం, ఆయు:ప్రమాణం బాగుంటాయి కాబట్టి) మరణిస్తుంటారు. ప్రజారోగ్య రంగంలో మేం సాధించిన పురోగతికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. అయితే అప్పుడప్పుడు సీజన్లు, సందర్భాలనుబట్టి చిన్న చిన్న వ్యాధులు వస్తూ ఉంటుంటాయి. అది ఎక్కడైనా సహజమే.
- విప్లవ దేశమైన క్యూబాలోని మహిళా సాధికారిత, లింగ సమానత్వం, వారి భద్రత, రక్షణ చర్యలను ఇతర దేశాలు ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు...?
క్యూబా విప్లవ ప్రారంభ దశలో ఒక ఉమెన్ ఫెడరేషన్ ఉండేది. ఆ తర్వాత కూడా ఈ సంఘం మహిళలను చైతన్య పరుస్తూ దేశాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేస్తూ వచ్చింది. మా దగ్గర సమాన పనికి సమాన వేతనమనేది నూటికి నూరు శాతం అమల్లో ఉంది. వైద్యరంగంలో మహిళలు 72 శాతం మంది ఉన్నారు. ఇదే రకమైన స్థితి అన్ని రంగాల్లోనూ ఉన్నది. మహిళా ఉద్యోగులు, కార్మికులు గర్భం దాల్చినప్పుడు వారి ప్రసవానికి రెండు నెలల ముందే పూర్తి వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేసే విధానం అమల్లో ఉంది. ప్రసవం తర్వాత కూడా తొమ్మిది నెలలపాటు పూర్తి వేతనంతో కూడిన సెలవులుంటాయి. ఆ తర్వాత కూడా వారు కోరితే మూణ్నెల్లపాటు 75 శాతం వేతనంతో సెలవులను ఇచ్చే విధానముంది. ఇప్పుడు ఓ కొత్త చట్టానికి రూపకల్పన చేయాలని భావిస్తున్నాం. అదేమంటే ప్రసవం తర్వాత ఏడాది వరకూ పూర్తి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలనేది. ప్రసవం తర్వాత ఆర్నెల్లు తల్లికి, ఆ తర్వాత మరో ఆర్నెల్లు తండ్రి(శిశువు అవసరం రీత్యా)కి పూర్తి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలనే ఆలోచన కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో దేశంలో మహిళల మాదిరిగానే మాకూ కొన్ని చట్టాలంటే బాగుంటుందంటూ పురుషులు అప్పుడప్పుడూ సరదాగా మాట్లాడుకోవటం క్యూబాలో పరిపాటిగా మారింది. అంత కఠినంగా, పకడ్బందీగా మహిళా చట్టాలు మా దేశంలో అమలవుతున్నాయి. హోసే మహతి అనే రచయిత చెప్పినట్టు... 'పిల్లల్ని కొట్టకూడదు. ఆడపిల్లల్ని కనీసం పూల రేకులతో కూడా కొట్టకూడదు...' అనే సిద్ధాంతాన్ని తూ.చా.తప్పకుండా పాటిస్తున్నాం. తద్వారా నూటికి నూరు శాతం గృహ హింసను నివారించగలుగుతున్నాం.
- ప్రపంచం మొత్తం మీ నాన్న (చే గువేరా) పేరు చెబితే విప్లవ స్ఫూర్తితో రగిలిపోతుంది. ఈ క్రమంలో ఆయన గురించిన మాటలు మీ నోటి ద్వారా వినాలనుకుంటున్నాం.. 'చే' గురించి మీ అభిప్రాయం...
నేను ఆయనతో కొన్ని సంవత్సరాలు మాత్రమే గడపగలిగాను. నాకు నాలుగున్నరేండ్ల వయసులో ఆయన కాంగోకు పయనమై వెళ్లిపోయారు. నాకు ఏడేండ్ల వయసప్పుడు ఆయన్ను బొలీవియాలో హత్య చేశారు. మా నాన్న ఓ గెరిల్లా లీడర్. నాయకుడనేవాడు ఎదుటివారికి ఉదాహర ణగా నిలబడాలి. తద్వారా తోటి వారు ముందుకెళ్లేలా చూడాలన్నది ఆయన తత్వం. తాను చెప్పేదానికి అనుగుణంగా ఆయన 24 గంటలూ కష్టపడే వారు. వారాంతాల్లో కూడా స్వచ్ఛందంగా పని చేసేవారు. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు వేకువజామున ఐదు గంటలకే నన్ను నిద్ర లేపేవారు. చెరుకు తోటలకు తీసుకెళ్లేవారు. అక్కడ నాన్న మిగతా వారితో కలిసి చెరుకును కోస్తూ ఉంటే... నేను చిన్న చిన్న చెరుకు గడలను తింటూ వారి మాటలను వింటుండేదాన్ని. ఆయన పని చేస్తున్నప్పుడు బట్టలన్నీ తడిసిపోయేవి. ఎప్పుడో ఒకసారి కొద్దిపాటి సమయం దొరికితే తాను కిందికి వంగి నన్ను మీదెక్కించుకుని గుర్రంలా ఆడించేవారు మా నాన్న. ఆయనతో నాకున్న బంధం అంతే (భావోద్వేగపూరితమయ్యారు). అయితే నాన్న మరణించిన నేపథ్యంలో నాకు అమ్మే అన్నీ అయ్యింది. ఆమెను నేను ఎక్కువగా ప్రేమించేదాన్ని. మా అమ్మ పేరు కూడా అలైదానే. ఆమె మీదున్న ప్రేమతోనే నాన్న... అమ్మ పేరునే నాకూ పెట్టారు. ఆయన లేకపోయినా ఆయన్ను, ఆయన సిద్ధాంతాలను ఎలా ప్రేమించాలో నేర్పిన మా అమ్మ... 16 ఏండ్ల వయసులో నాకో పుస్తకం ఇచ్చింది. అది చదువుతుంటే ఎంతో ఉత్సాహం, స్ఫూర్తి రగిలేవి. ఆ తర్వాత తెలిసింది అది మా నాన్న రాసిన పుస్తకమేనని. అయితే 'బొలీవియన్ డైరీ...' చదవటం నాకు అత్యంత కష్టమైంది. ఎందుకంటే నాన్న జీవితంలోని ఆఖరి పేజీలు, ఘట్టాలూ అందులో ఉన్నాయి కాబట్టి...
- ఫైడల్ కాస్ట్రోతో ఉన్న అనుబంధం గురించి వివరిస్తారా..?
ఆయన నాకు తండ్రి తర్వాత తండ్రిలాంటి వారు. నాన్న విప్లవ సహచరుడైన ఫైడల్ను చూస్తూ పెరిగాను. తద్వారా కాస్ట్రో గురించి ఎంతో తెలుసుకున్నా. 1987లో నా పెండ్లి అయింది. ఆ పెండ్లి కోసం రాత్రి 11.30 గంటల వరకూ ఆగాను. ఎందుకంటే ఫైడల్ వచ్చిన తర్వాతే చేసుకోవాలన్నది నా కోరిక. బిజీ షెడ్యూల్ వల్ల ఆయన చాలా ఆలస్యంగా వచ్చారు. అయినా ఆయన వచ్చిన దాకా ఉండి... ఆ తర్వాతే పెండ్లి చేసుకున్నా. మా పాప ఎస్తేఫానియా పుట్టినప్పుడు ఆయన నన్ను, పాపను చూడటం కోసం ఆస్పత్రికి వచ్చారు. విక్టోరియా అని ఆ పాపకు పేరు పెట్టాలని ఆయన భావించారు. కానీ అప్పటికే నేను, నా భర్త కలిసి వేరే పేరు నిర్ణయించటంతో ఆయన ఒకింత అలకబూనారు. 'మీ అమ్మ నేను చెబితే వినటం లేదు. ఆమె లాంటి మనస్తత్వం నీకు రాకూడదు...' అంటూ పాపను ఆశీర్వదించి అలకతో వెళ్లిపోయారు.
- అమెరికా సామ్రాజ్యవాదానికి తలొగ్గటం కంటే సముద్రంలో మునిగి చావటం మంచిదంటూ కాస్ట్రో ఇచ్చిన నినాదం ఇప్పటికీ క్యూబా ప్రజల్లో స్ఫూర్తిని రగిలిస్తూ ఉంది. అంతలా ప్రజలు నిలబడటానికి కారణమేంటి..?
అమెరికా ఆర్థిక ఆంక్షలను తట్టుకోవటం మాకు అత్యంత కష్టమైన పని. వాటిని తట్టుకోవటం, అధిగమించటం మినహా మాకు గత్యంతరం లేదు. యాభై ఏండ్లపాటు మేం అమెరికా ఆధిపత్యానికి బలైపోయాం. ఆ తర్వాత విప్లవ పంథాతో సోషలిజాన్ని సాధించాం. అలాంటి సమాజం మాకే ప్రత్యేకమైంది. విద్య, వైద్య రంగాల్లో మా దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. గతంలో ప్రతీ వెయ్యి మంది శిశువుల్లో 60 మంది మరణించేవారు. ఇప్పుడా సంఖ్యను ఐదుకు తగ్గించగలిగాం. సోషలిజం అనేది లేకపోతే అమెరికా వల్ల క్యూబా నామ రూపాల్లేకుండా పోతుంది. అందువల్ల మేం దాన్ని వదులుకునే ప్రసక్తే లేదు.