Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెట్రోపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసలు
- ఎయిర్‌పోర్టు మెట్రో ప్రత్యేకతలు కమిటికీ వివరించిన మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చెందిన 14 మంది సభ్యులు హైదరాబాద్ మెట్రోరైలులో ప్రయాణం చేశారు. శనివారం రాత్రి రాయదుర్గ్ నుంచి అమీర్‌పేట్ స్టేషన్ వరకు కమిటీ సభ్యులు ప్రయాణం చేశారు. హైదరాబాద్ మెట్రో కార్యకలాపాలను పరిశీలించి.. ప్రశంసలు కురిపించారు. రాజీవ్ రంజన్ సింగ్ నేతృత్వంలో హైదరాబాద్ వచ్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ టీమ్ అనేక విషయాలను దగ్గర నుంచి పరిశీలించింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డిని, ఎల్ అండ్‌టీ ఎండీ, సీఎండీ కేవీబీ రెడ్డిని వారు కలిశారు. అయిదేండ్లుగా హైదరాబాద్ మెట్రో నడుస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీపీపీ విధానంలో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైలు ప్రాజెక్ట్‌గా హైదరాబాద్ మెట్రో రైలు ఖ్యాతి గాంచిన విషయాన్ని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
అలాగే మెట్రో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఎన్వీఎస్ రెడ్డి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వివరించారు. అమీర్ పేట్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన షాపింగ్ కాంప్లెక్స్‌ను కమిటీ సభ్యులకు చూపించారు. అలాగే త్వరలో ప్రారంభం కానున్న ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ గురించి కూడా కమిటీ సభ్యులకు వివరించారు. సర్వే పూర్తయిన వెంటనే పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎన్వీఎస్ రెడ్డి వారికి వివరించారు. మెట్రో రైల్‌ను సందర్శించిన వారిలో కమిటీ సభ్యులు ఆర్. గిరిరాజన్, రామ్ చందర్ జంగ్రా, కవితా పాటిదార్, బెన్నీ బెహనన్, శంకర్ లాల్వానీ, హస్నైన్ మసూది తదితరులు ఉన్నారు.