Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షులు కల్వకుంట్ల కవిత
- భూపాలపల్లి ఏరియాలో పర్యటన
- టీబీజీకేఎస్ (కొక్కుల తిరుపతి స్మారక భవనం) కార్యాలయ ప్రారంభం
- హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి
నవతెలంగాణ- కోల్ బెల్ట్
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అన్ని రకాల పదవుల్లో యువతకు మూడింట ఒక వంతు ప్రాధాన్యత ఇవ్వాలని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి విచ్చేసిన కవితకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, తెలంగాణ జాగృతి నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు కొక్కుల తిరుపతి కుటుంబాన్ని పరామర్శించి, అండదండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం సంఘ కార్యాలయ భవనాన్ని ప్రారంభించి, కొక్కుల తిరుపతి స్మారక భవనంగా నామకరణం చేశారు. కార్యాలయ ప్రాంగణంలో టీబీజీకేఎస్ అధ్యక్షులు ఎల్. వెంకట్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు. తిరుపతి మరణం తీరని లోటని, వారి కుటుంబానికి డెత్ రిలీఫ్ ఫండ్ ఇప్పించాలని నాయకులను ఆదేశించారు. సింగరేణి తెలంగాణకే కాకుండా 13 రాష్ట్రాలకు బొగ్గు సరఫరా చేయడమే కాకుండా, బొగ్గు వెలికితీతతో పాటు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నదని, 12 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పిందని తెలిపారు.
రాష్ట్రం ఏర్పడ్డాక 18 వేల మంది యువకులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని వివరించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే పనిలో ఉందని ఆరోపించారు. సింగరేణి సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటుపరం కాకుండా అడ్డుకొని తీరుతామని, దానికి కార్మికుల మద్దతు కావాలని కోరారు. సింగరేణి వ్యాప్తంగా డిస్మిస్ అయిన ఉద్యోగులను యాజమాన్యంతో మాట్లాడి విధుల్లోకి తీసుకున్న ప్రయత్నం చేస్తామని, ఏరియాలోని కేటీకే ఓసీ-2 ఉద్యోగుల అభ్యర్థన మేరకు ట్రాన్స్ఫర్లను నిలుపుదల చేసే ప్రయత్నం, సింగరేణి స్కూల్ టీచర్లకు 10 నెలల జీతం కాకుండా 12 నెలల జీతం ఇప్పించేలా సీఎం దృష్టికి వెళ్తామని తెలిపారు. భూపాలపల్లి ఏరియా హాస్పిటల్లో సిటీ స్కాన్ యంత్రాన్ని, పిల్లల డాక్టర్లను ఏర్పాటు చేయించాలని సంఘ నాయకులకు సూచించారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు సింగరేణి కార్మికులు నీడ, గూడు లేని విధంగా ఉండేవారని, సీఎం కేసీఆర్ సింగరేణి పరిరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్నారని, లాభాలు పంచడంలో దార్శినికత చూపిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ మధుసూనాచారి మాట్లాడుతూ.. రేపటి నుంచి ఏ ఎన్నిక వచ్చిన బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించడమే తిరుపతికి ఇచ్చే ఘన నివాళి అన్నారు. భూపాలపల్లి సమగ్ర అభివృద్ధికి ఇతర ప్రాంతాల కంటే ప్రత్యేక దృష్టి సారించాలని కవితను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మెన్ వాసుదేవరెడ్డి, భూపాలపల్లి జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, తదితరులు పాల్గొన్నారు.