Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'సరోజం' ఆత్మకథ ఆవిష్కరణలో జూలూరి...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ పునరుజ్జీవన దశలో మన చరిత్రను మనం తెలుసుకోవాలని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరు గౌరి శంకర్ అన్నారు. ఆదివారం పద్మారావునగర్‌లోని శివానంద ఆశ్రమంలో డాక్టర్ సరోజన బండ రాసిన ఆత్మకథ 'సరోజం' గ్రంథ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తెలంగాణలో ఆత్మకథలు రాసిన రచయిత్రులు చాలా తక్కువని అన్నారు. ఆత్మకథల్లో ఎంతో సామాజిక చరిత్ర రికార్డు అవుతుందని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న వీరుల ఆత్మ కథలు చదివితే ఎన్నో విషయాలు బోధపడతాయన్నారు. విశ్వసనీయత, నిజాయితీ ఉన్నప్పుడే అది చారిత్రక ఆత్మకథగా మిగులుతుందని చెప్పారు. 'సరోజం' ఆత్మకథను విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎం ఛాయారతన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'సరోజం'లోని కొన్ని భాగాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చితే ఇప్పటి తరాలు గత చరిత్రను, జీవన విలువలను నేర్చుకుంటారని సూచించారు. తెలంగాణ అడ్వకేట్ జనరల్ బండ శివానంద ప్రసాద్ మాట్లాడుతూ ఆత్మకథలో ఎన్నో జ్ఞాపకాలను నమోదు చేశారని అన్నారు. కార్యక్రమానికి జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత వహించగా ఉస్మానియా మెడికల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ బొడ్డు ప్రభాకర్, న్యూరో ఫిజీషియన్ డాక్టర్ జీ శ్రీధర్, ప్రముఖ విమర్శకులు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ వెల్దండి శ్రీధర్, దామెర రాములు, కె.ఎల్. సూర్య, రమ, చెరుకు మహేశ్వర శర్మ, కామాడి లక్ష్మయ్య, తదితర సాహితీవేత్తలు పాల్గొన్నారు.