Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'చే' స్ఫూర్తితో ఉద్యమాలు : అలైదా గువేరా పర్యటన సందర్భంగా కూనంనేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విప్లవానికి వెలుగు చూపిన వేగు చుక్క చేగువేరా, ఆయన స్ఫూర్తితో ప్రజా పోరాటాలను నిర్మించాల్సిన అవసరముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం హైరాబాద్లోని మగ్ధూం భవన్లో నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా(ఎన్సీఎస్సీ)-ఐప్సో ఆధ్వర్యంలో ప్రపంచ విప్లవ యోథుడు చేగువేరా కుమార్తె డాక్టర్ అలైదా గువేరా, మనవరాలు ఆచార్య ఎస్తేఫానియా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా వారికి అక్కడ ఘన స్వాగతం పలికారు. పార్టీ, పలు ప్రజాసంఘాలు పుష్పగుచ్ఛాలతో అభినందించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని మాట్లాడుతూ చేగువేరా ఎప్పటికీ యువకుడేనని చెప్పారు. సూర్యచంద్రులున్నంత కాలం ఆయన పేరు నిలిచే ఉంటుందన్నారు. చేగువేరా పేరు ఇప్పుడు ప్రపంచాన్ని ఉత్తేజ పరుస్తున్నదని చెప్పారు. మన దేశంలో భగత్‌సింగ్ ఎలాగో ప్రపంచానికి చేగువేరా అలాంటి గొప్ప వ్యక్త అని పేర్కొన్నారు. ఎప్పటికైనా కమ్యూనిజం అజేయంగా నిలుస్తుందన్నారు. ఆయన నాటిన కమ్యూనిస్టు బీజాలు లాఠిన్ అమెరాకాలో వికసిస్తున్నాయని చెప్పారు. ఆయన స్ఫూర్తితో పనిచేయటమంటే..పెట్టుబడిదారీ విధానాన్ని సమాధిచేసి, సోషలిజాన్ని స్థాపించటమేనన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఆర్ ఆరుణ్‌కుమార్, ఐప్సో నాయకులు డీజీ నర్సింహారావు, సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాష, సీనియర్ నాయకులు కందిమళ్ల ప్రతాపరెడ్డి, పశ్యపద్మ, ఆమ్ఆద్మీ పార్టీ నాయకులు డి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.