Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తెలుగు ప్రజలదే
- మహాసభప్రాంగణంలో ఏపీ, తెలంగాణ సీఐటీయూ నేతల ప్రదర్శన
బెంగుళూరు నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
'అమ్మేటోడెవ్వడు...కొనేటోడెవ్వడు'.....విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తెలుగు ప్రజల హక్కు...సేవ్ పబ్లిక్ సెక్టార్..సేవ్ ఇండియా..ప్రాణాలైనా అర్పిస్తాం.. ఉక్కుపరిశ్రమను కాపాడుకుంటాం..మీకు చేతగాకపోతే కార్మికులకివ్వండి..మేం నడిపించుకుంటాం' అంటూ సీఐటీయూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. సీఐటీయూ అఖిల భారత మహాసభల ముగింపు సందర్భంగా వారు ప్యాలెస్గ్రౌండ్లో రెండు రాష్ట్రాల ప్రతినిధులు ప్రదర్శన చేపట్టారు. మహాసభ ప్రాంగణం నుంచి మెయిన్ గేటు వరకు సుమారు రెండు వందల మంది ప్రతినిధులు ర్యాలీగా వెళ్లారు. విశాఖలో జరుగుతున్న స్టీల్ ఫ్యాక్టరీ కార్మికుల పోరాటాన్ని ఆపేదే లేదనీ, ప్రయివేటీకరణను అడ్డుకుని తీరుతామని ప్రతిమబూనారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకించారు. ఈ ర్యాలీలో సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.నర్సింగరావు, అధ్యక్షులు ఏవీ నాగేశ్వర్రావు, సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, రెండు రాష్ట్రాల నాయకులు పాల్గొన్నారు.